నానక్ రామ్ గూడా లోని హెచ్‌జిసీఎల్ కార్యాలయంలో జిహెచ్ఎంసి, పురపాలక శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు

Spread the love

సాక్షిత : ప్రస్తుతం భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ నగర పరిధిలో అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ పురపాలక శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రాణ నష్టం జరగకుండా చూడడమే ప్రథమ కర్తవ్యంగా పనిచేయాలని కేటీఆర్ ఆదేశించారు.

నానక్ రామ్ గూడా లోని హెచ్‌జిసీఎల్ కార్యాలయంలో జిహెచ్ఎంసి, పురపాలక శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. రానున్న రెండు మూడు రోజులపాటు నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున మహా నగర పాలక సంస్థ ఇతర సంస్థలతో – ముఖ్యంగా జలమండలి, విద్యుత్ శాఖ, రెవెన్యూ యంత్రాంగం, ట్రాఫిక్ పోలీస్ వంటి కీలకమైన విభాగాలతో – నిరంతరం సమన్వయం చేసుకొని సర్వసన్నద్ధంగా ఉండాలని కేటీఆర్ సూచించారు.

భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకొని నగరంలో లోతట్టు ప్రాంతాలు, జలమయం అయ్యే ప్రధాన రహదారుల వంటి చోట్ల డి వాటరింగ్ పంపులు, సిబ్బంది మోహరింపు వంటి ప్రాథమిక కార్యక్రమాలను ఇప్పటికే పూర్తి చేసినట్లు అధికారులు మంత్రికి తెలిపారు.

జిహెచ్ఎంసి చేపట్టిన ఎస్ ఎన్ డి పి కార్యక్రమంలో భాగంగా నాలాల బలోపేతం చేయడం వలన వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈ సంవత్సరం ఇబ్బందులు తప్పుతాయన్న విశ్వాసాన్ని ఈ సందర్భంగా అధికారులు వ్యక్తం చేశారు.

హైదరాబాద్ నగర పారిశుధ్య నిర్వహణకు సంబంధించి కూడా ఈ సమీక్ష సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. హైదరాబాద్ నగర పారిశుద్ధ్య నిర్వహణ గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం ఎన్నో ప్రభావవంతమైన ఫలితాలను ఇస్తున్నదని అయితే వీటితోనే సంతృప్తి చెందకుండా మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఈ సందర్భంగా కేటీఆర్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

హైదరాబాద్ నగరం వేగంగా విస్తరించడం, జనాభా పెరగడం వంటి అంశాల వలన నగరంలో చెత్త ఉత్పత్తి పెరుగుతున్నదని, ఈ మేరకు పారిశుధ్య నిర్వహణ ప్రణాళికలను సైతం ఎప్పటికప్పుడు నిర్దేశించుకుంటూ ముందుకు పోవాలని సూచించారు. ఈ సందర్భంగా అధికారులు తమ తక్షణ, స్వల్పకాలిక పారిశుధ్య ప్రణాళికలను మంత్రి కేటీఆర్ కి వివరించారు. పారిశుద్ధ్య నిర్వహణ విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని, ఇదే అత్యంత ప్రాధాన్యత అంశంగా గుర్తించి, ఆ దిశగా పనిచేయాలని మంత్రి అధికారులకు సూచించారు.

ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ తో పాటు జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రాస్, జోనల్ కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page