చట్టాన్ని అతిక్రమించేవారు గుర్తుపెట్టుకోండి

Spread the love

చట్టాన్ని అతిక్రమించేవారు గుర్తుపెట్టుకోండి..మీ గుండెల్లో నిద్రపోతా…*

చంద్రబాబు

సాక్షితఅమరావతి : ‘‘చట్టాన్ని అతిక్రమించేవారు గుర్తుపెట్టుకోండి..మీ గుండెల్లో నిద్రపోతా. తప్పు చేసినవాడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చట్టాన్ని ఉల్లంఘిస్తే అధికారులకైనా శిక్ష తప్పదు’’ అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. శుక్రవారం టీడీపీ లీగల్ సెల్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో చరిత్ర సృష్టించిన పార్టీ టీడీపీ అని, ఏ రాజకీయ పార్టీకి రానన్ని అవకాశాలు టీడీపీకి వచ్చాయని తెలిపారు. టీడీపీకి 40 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉందన్నారు. ఇలాంటి పనికిమాలిన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని తన జీవితంలో ఊహించలేదని తెలిపారు. ఇన్నేళ్లలో ఏ సీఎం వ్యక్తిగతంగా ప్రవర్తించలేదని తెలిపారు. పోలీస్ వ్యవస్థను వైసీపీ భ్రష్టుపట్టించిందని విమర్శించారు. తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు పోలీస్ శాఖలో కొందరిని పెట్టుకున్నారని ఆరోపించారు. వివేకా హత్య కేసు తర్వాత ఇద్దరు చనిపోయారని, అప్రూవర్ దస్తగిరి కూడా ప్రాణ భయంతో ఉన్నాడన్నారు. ఏపీలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. ఎంపీ రఘురామకృష్ణంరాజును కస్టడీలోకి తీసుకుని పోలీసులు వేధించారన్నారు. రఘురామపై పోలీసులు ఇష్టానుసారంగా ప్రవర్తించారని తెలిపారు. ‘‘రఘురామను ఏపీకి రాలేని పరిస్థితిని కల్పించారు. ఒక ఎంపీకే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితేంటి?’’ అని ప్రశ్నించారు. ఎవరికీ అన్యాయం జరిగినా టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధానికి ఒప్పుకుని అధికారంలోకి రాగానే జగన్ మాటమార్చారని ఆగ్రహించారు. మూడు రాజధానుల పేరుతో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. కోర్టులు మొట్టికాయలు వేసినా జగన్ తీరు మారడం లేదన్నారు. జగన్ అధికారంలోకి వచ్చి ఏపీని సర్వనాశనం చేశారని అన్నారు. పోలవరాన్ని ముంచేశారని, విశాఖను తొల్చేస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు.

Related Posts

You cannot copy content of this page