మత్స్యరంగం పై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారి అభివృద్ధి, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి

Spread the love

The state government is constantly working for the development and welfare of the people who depend on the fisheries sector for their livelihood

మత్స్యరంగం పై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారి అభివృద్ధి, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. బేగం బజార్ లో 9.50 కోట్ల రూపాయల వ్యయంతో ఆధునిక హంగులతో నూతనంగా నిర్మించిన ఫిష్ మార్కెట్ భవనాన్ని ప్రారంభించారు.

జీ ప్లస్ 2 విధానంలో నిర్మించిన మార్కెట్ భవనం మొత్తం కలియతిరిగి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంతో చరిత్ర కలిగిన బేగం బజార్ ఫిష్ మార్కెట్ లో సరైన సౌకర్యాలు, వసతులు లేక విక్రయదారులు, కొనుగోలు దారులు అనేక ఇబ్బందులు పడేవారని పేర్కొన్నారు.

వీటిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం 9.50 కోట్ల రూపాయల వ్యయంతో అన్ని సౌకర్యాలు, వసతులతో నూతన మార్కెట్ భవనాన్ని నిర్మించినట్లు తెలిపారు. 43 హోల్ సేల్ స్టాల్స్, ఒక కోల్డ్ స్టోరేజీ, 90 రిటైల్ స్టాల్స్, 71 కటింగ్ స్టాల్స్, 10 డ్రై ఫిష్ స్టాల్స్, ఒక క్యాంటీన్ ను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు.

అంతేకాకుండా రెండు లిఫ్ట్ లను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ మార్కెట్ లో వ్యాపారం చేసుకొనే వారికి మాత్రమే స్టాల్స్ కేటాయించడం జరుగుతుందని స్పష్టం చేశారు. స్టాల్స్ కు అర్హులైన వారి పేర్ల జాబితా ను బోర్డ్ ఏర్పాటు చేసి ప్రదర్శించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

భవనం బయట విక్రయాలు జరిపి ప్రజలకు, ఇతర వ్యాపారులను ఇబ్బందులకు గురిచేయవద్దని చెప్పారు. పరిశుభ్రమైన వాతావరణం ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని, తద్వారా కొనుగోలు దారులు కూడా అధికంగా వచ్చే అవకాశం ఉంటుందని వివరించారు.

మత్స్యాకారులు అభివృద్ధి సాధించాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను విడుదల చేస్తుందని, దీని ద్వారా రాష్ట్రంలో మత్స్య సంపద భారీగా పెరిగిందని తెలిపారు. చేపల విక్రయాల కోసం మత్స్యకారులకు సబ్సిడీ పై వాహనాలను అందజేసినట్లు వివరించారు. అంతేకాకుండా పరిశుభ్రమైన వాతావరణంలో చేపలను విక్రయించుకోవడం వలన మత్స్యకారులు గిట్టుబాటు ధరను పొందే అవకాశం ఉంటుందనే ఆలోచనతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో మార్కెట్ ల నిర్మాణానికి చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు.

GHMC పరిధిలోని కూకట్ పల్లి, మల్లాపూర్ లలో కూడా నూతన చేపల మార్కెట్ ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. 50 కోట్ల రూపాయల వ్యయంతో హోల్ సేల్ ఎక్స్ పోర్ట్ ఫిష్ మార్కెట్ ను నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు.

బేగంబజార్ ఫిష్ మార్కెట్ పై ఆధారపడి 500 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని పేర్కొన్నారు. అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలనేది ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు లక్ష్యం అన్నారు.

పేదప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి కార్యక్రమం ద్వారా పేదింటి ఆడపడుచు పెండ్లికి ఒక లక్ష 116 రూపాయల ఆర్ధిక సహాయం అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు.

ఆసరా పెన్షన్ క్రింద ఆర్ధిక సహాయం అందించే వృద్దుల వయసును 65 నుండి 57 సంవత్సరాలకు తగ్గించినట్లు చెప్పారు. వీరికి ఆగస్టు 15 నుండి పెన్షన్ లను అందిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, ఫిషరీస్ కమిషనర్ లచ్చిరాం బూక్యా, బేగంబజార్ కార్పొరేటర్ శంకర్ యాదవ్, GHMC ప్రాజెక్ట్స్ CE దేవానంద్, DD నాయక్, SE దత్తు పాంత్, EE సురేష్, ఎస్టేట్ ఆఫీసర్ బాషా, TRS నాయకులు ప్రేంసింగ్ రాథోడ్, నందు బిలాల్, మాజీ కార్పొరేటర్ లు మమతాగుప్తా, పరమేశ్వరి సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page