SAKSHITHA NEWS

లత హత్య అత్యంత దారుణం

  • వరకట్న వేధింపులకు వ్యతిరేకంగా పోరాడుదాం

మహిళలు, ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమిస్తాం

ప్రభుత్వాలు స్పందించి చిత్త శుద్ధితో ప్రజలకు అవగాహన కల్పించాలి

  • పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాదన కుమార స్వామి

సారంగాపూర్ / జగిత్యాల జిల్లా:

జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రేచపల్లి గ్రామానికి చెందిన పోగుల రాజేశం బిడ్డ
చంద లత (పోగుల లత) నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం రేవోజీపేట గ్రామంలో ఈనెల 8 శుక్రవారం జరిగిన వరకట్న వేధింపుల హత్య కు గురి కావడం అత్యంత దారుణమని పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాధన కుమార స్వామి, ఉమ్మడి కరీం నగర్ జిల్లా అధ్యక్షులు శ్రీపతి రాజ గోపాల్ లు అన్నారు. వరకట్న చావులు, వేధింపులు ఇకనైనా ఆగిపోవాలని, లత మరణమే చివరి మరణం కావాలని వారు ఒక ప్రకటనలో తెలిపారు. గత నాలుగు రోజులుగా పోగుల లత అలియాస్ చంద లత హత్య పట్ల వారు రేచపల్లితో పాటు హత్య జరిగిన రేవోజీపేట గ్రామాలలో పర్యటించి లత హత్యకు గల బలమైన కారణాలపై ఆరా తీశామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. రేవోజీపేట మహిళలు సైతం కన్నీరు మున్నీరు గా విలపిస్తూ లత హత్య పై పూర్తి వివరాలు తెలిపినట్లు వారు వెల్లడించారు. దస్తూరాబాద్ ఎస్సై శంకర్, సి.ఐ. సైదారావు, నిర్మల్ డిఎస్పీ అల్లూరి గంగారెడ్డి లను కూడా కలిసి లత హత్య పట్ల సరైన విచారణ చేపట్టి న్యాయం చేయాలని కోరినట్లు వారు వివరించారు. లత హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు చేసిన కుట్రలను కూడా వారు తిప్పి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మృతురాలి కుటుంబ సభ్యులు, రేచపల్లి గ్రామస్తుల నిర్ణయం మేరకు శవాన్ని రీ – పోస్ట్ మార్టం కూడా చేయించాల్సి వస్తుందని వారు పోలీస్ అధికారులకు తేల్చి చెప్పారు.
పథకం ప్రకారమే లతను గొంతు పిసికి, చిత్ర హింసలతో హత్య చేసి బాత్ రూంలో ఆత్మ హత్య చేసుకుందని చిత్రీకరించారని వారు ఆరోపించారు. ధన బలంతో డబ్బును ఎదజల్లి హంతకులు బయటికి వస్తారని వారితో ఏకంగా రేగోజీ పేట గ్రామస్తులే వాపోయారని తెలిపారు. లత అత్తగారి ఇంటివాళ్ళతో పాటు ఆ గ్రామస్తులు, చివరికి పోలీసులు సైతం మృతురాలి తల్లి – తండ్రులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే వారు ఎవరు కూడా రాకముందే శవానికి పంచనామా నిర్వహించడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు.
పక్కా పకడ్బందీ ప్రణాళికతో పాటు బలమైన ధన – రాజకీయ – పైరవీల శక్తుల ద్వారానే ఈ హత్య గావించినట్లు రేవోజిపేట లో నిర్వహించిన నిజ – నిర్ధారణలో వెల్లడైందని తెలిపారు.
ఇప్పటికైనా పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి సరైన పద్ధతిలో పారదర్శకంగా విచారణ చేపట్టని ఎడల ఉన్నతాధికారులతో పాటు అవసరం అయితే న్యాయస్థానం ద్వారా కేసు పునర్విచారణ తో పాటు శవానికి రీ – పోస్ట్ మార్టం కూడా చేయించడానికి కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు, ప్రజా సంఘాల వారు, గ్రామస్తులు సిద్ధంగా ఉన్నారని వారు స్పష్టం చేశారు.

పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్యవర్గ సభ్యులు కడ రాజన్న, కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూరం అభినవ్, దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ర్ట కార్యదర్శి మార్వాడి సుదర్శన్,సీనియర్ జర్నలిస్ట్, తెలంగాణ జన సమితి జగిత్యాల జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి, ఖానాపూర్ డిటీఫ్ నాయకులు గొలుసుల నర్సయ్య, భారతీయ నాస్తిక సమాజం నాయకులు బొమ్మేన రాజ్ కుమార్, సామాజిక ఉద్యమ కళాకారులు బొమ్మెన రాకేష్ లతో పాటు పలు ప్రజా సంఘాల నాయకులు లత హత్యపై సరైన విచారణ జరిపి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకొని నిందితులను శిక్షించాలని, ఇలాంటి వరకట్నపు హత్యలు, చిత్ర హింసలు, వేధింపులు మరెక్కడా జరుగకుండా ఈ కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకొని, ప్రజల్లో తగు అవగాహన కల్పించాలని డిమాండ్ చేసినట్లు వారు పేర్కొన్నారు.


SAKSHITHA NEWS