TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, టీటీడీ ఆర్జిత సేవా టికెట్లు విడుదల

Spread the love

తిరుమల శ్రీవారి ఆలయంలో మే నెలకు సంబంధించి దర్శనం టికెట్లు, సేవలకు సంబంధించి వివిధ కోటాలను విడుదల చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాలు, సహస్రదీపాలంకర సేవా టికెట్లు ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. వర్చువల్ సేవలు, స్లాట్ల కోసం మే కోటాను ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. కాగా రేపు ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల మే కోటా, 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ కోటా టోకెన్లను టీటీడీ అందుబాటులో ఉంచనుంది. వృద్ధులు, వికలాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు తిరుమలకు వచ్చేందుకు వీలుగా ఈ నెల 23న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్లను విడుదల చేయనున్నారు.

మే నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను 24న ఉదయం 10 గంటలకు, తిరుమల, తిరుపతిలో వసతి గదుల కోటాను 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. శ్రీవారి సేవ, నవనిత సేవ, పరకామణి సేవకు సంబంధించిన కోటాలు 27న ఉదయం 11 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి.

టికెట్ కోటా విడుదలతో పాటు తిరుమలలో ప్రస్తుతం భక్తుల రద్దీ సాధారణంగానే ఉన్నట్లు సమాచారం. నిన్న శ్రీవారిని 69,191 మంది దర్శించుకోగా, 22,295 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి హుండీలో కానుకగా రూ.3.60 కోట్లు సమర్పించారు. 13 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉండటంతో టైమ్ స్లాట్ దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతోంది. దర్శనం టికెట్లు లేని భక్తులు 12 గంటల్లో, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఉన్న భక్తులు 3 గంటల్లో దర్శనం పొందవచ్చు.

Related Posts

You cannot copy content of this page