BRS demand for GPC BRS MPs protest with placards at Gandhi statue
జీపీసీకి బీఆర్ఎస్ డిమాండ్
గాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులతో బీఆర్ ఎస్ ఎంపీల నిరసన
వాస్తవాలు ప్రజల ముందుంచాలి: నామ డిమాండ్
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
అదానీ అంశంపై ఆరో రోజు కూడా పార్లమెంట్ ఉభయ సభలు బీఆర్ఎస్ ఎంపీల ఆందోళనతో హోరెత్తాయి. తక్షణమే సంయుక్త పార్లమెంటరీ కమిటీని నియమించి, కేంద్రం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని బీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. కేంద్రం వైఖరికి నిరసనగా ఉభయ సభలను బహిష్కరించిన అనంతరం బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు పార్లమెంటరీ నేత కే. కేశవరావు, లోక్ సభా పక్ష నాయకులు నామ నాగేశ్వరరావు నాయకత్వంలో పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు నిరసన చేపట్టారు.
ఆమ్ ఆద్మీ ఎంపీలు కూడా ప్లకార్డులు పట్టుకుని ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నామ నాగేశ్వరరావు ఎంపీలనుద్దేశించి మాట్లాడుతూ అదానీ వ్యవహారంపై జేపీసీ దర్యాప్తు చేపట్టి, వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని కేంద్రాన్ని కోరారు. ఆరు రోజులుగా బీఆర్ఎస్ ఎంపీలు దేశ ప్రజలకు సంబంధించిన కీలక అంశంపై చర్చ జరపాలని కోరుతున్నా కేంద్రం పట్టించుకోకపోవడం దారుణమన్నారు.
ఇది ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. కోట్లాది మందికి సంబంధించిన కీలక అంశంపై చర్చ జరపాలని, విచారణకు సంయుక్త పార్లమెంటరీ కమిటీని వేయాలని కోరుతూ నిరసన తెలియజేస్తున్నా కేంద్రానికి పట్టడం లేదన్నారు. ఈ అంశంలో కేంద్రం ఎందుకు భయపడి, వెనక్కిపోతుందో అర్ధంకావడం లేదన్నారు. ఏమి లేకపోతే ఎందుకు సభలో ఆదానీ అంశాన్ని చర్చించడం లేదని ప్రశ్నించారు.
ఇప్పటికైనా కేంద్రం స్పందించి, పార్లమెంట్ ఉభయ సభల్లో అదానీ అంశాన్ని చర్చించి, ప్రజల్లోని అనుమానాలను నివృత్తి చేయాలని నామ డిమాండ్ చేశారు. ఎంతో మంది పేదలు కష్టపడి సంపాదించుకున్న డబ్బును ఎల్ఐసీ, బ్యాంకుల్లో తమ పిల్లల చదువులు కోసం, పెళ్ళిళ్లు, ఇతర అవసరానికి దాచుకున్నారని, ఇప్పుడీ సంక్షోభం వల్ల వారంతా తీవ్ర భయాందోళనలు చెందుతున్నారని నామ అన్నారు. వాస్తవాలు దేశ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని నామ పేర్కొన్నారు.