ఖమ్మం లో ఘనంగా విశ్వ మానవమూర్తి బాబా సాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు.

Spread the love

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

విశ్వ మానవమూర్తి బాబా సాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకుని స్థానిక అంబేద్కర్ కూడలిలో బాబా సాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్, నగర మేయర్ పునుకొల్లు నీరజ, డీసీఎంఎస్ చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, కార్పొరేటర్లు బి.జి. క్లెమెట్, అమృతమ్మలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, చిన్న నాటి నుండి సామాజిక వివక్షను ఎదుర్కొన్న డా.బి.అర్. అంబేద్కర్, కష్టపడి ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకొని, తన చదువును, తన జీవితాన్ని పూర్తిగా అణగారిన, పేద, దళిత వర్గాల అభివృద్ధికై అంకితం చేశారని తెలిపారు. ఆయన జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకమని గ్రహించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు డా.బి.అర్. అంబేద్కర్ చేసిన సేవలను ప్రజలకు గుర్తిండి పోయేలా హైదరాబాద్ మహానగరంలో 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసి నేడు ఆవిష్కరిస్తున్నారని అన్నారు.

రాష్ట్రంలో దళితులందరికీ ప్రయోజనం కలగాలని దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టినట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే 35 వేల దళిత కుటుంబాలు లబ్ది పొందాయని, వచ్చే సంవత్సరం 17 వేల కుటుంబాలకు లబ్ది చేకూరనుందని ఆయన అన్నారు. డా. బి.ఆర్. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రపంచానికి దిక్సూచి గా నిలిచిందని అన్నారు. ఫ్రాన్స్ ల ఎన్నో దేశాల్లో రాజ్యాంగాలు మారుతూ వచ్చాయని, మన రాజ్యాంగం నేటికి ఆచరణలో ఉందని అన్నారు. బడుగు, బలహీన వర్గాలకు స్వర్ణ కాలమని, క్రొత్తగా నిర్మించిన సచివాలయానికి డా. బి.ఆర్. అంబేద్కర్ నామకరణం చేశారని, ఈ నెలలోనే ప్రారంభం కానుందని ఆయన తెలిపారు. కులాలు, మతాలకు అతీతంగా సమాన హక్కుల కోసం ఆయన పోరాడారని, అంబేద్కర్ ఒక వర్గానికి లీడర్ కాదని, దేశం మొత్తానికి లీడర్ అని ఆయన అన్నారు. నెక్లెస్ రోడ్ లో జరుగుతున్న జయంతి వేడుకలకు జిల్లా నుండి 1500 మంది హాజరవుతున్నట్లు, దేశం మొత్తం మన వైపే చూస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగాన్ని రచించి, ప్రపంచంలోనే ఉత్తమమైన రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడని అన్నారు. ప్రతి ఒక్కరూ అంబేడ్కర్ ను స్పూర్తిగా తీసుకొని, వారి ఆశయాలను ఆచరణలో పెట్టి, సమాజ సేవ చేయాలన్నారు.


కార్యక్రమంలో నగర మేయర్ మాట్లాడుతూ, స్వేచ్ఛ, సమానత్వాన్ని జీవిత సూత్రాలుగా, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడిన మహనీయులు డా. బి.ఆర్. అంబేద్కర్ అని, వారి సేవలను కొనియాడారు. మహిళల అభ్యున్నతికి పాటుపడ్డారని, కేవలం బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికే కాకుండా భారత దేశంలోని ప్రతి ఒక్క వర్గానికి సమన్యాయం చేసుకుంటూ, రాజ్యాంగం రూపకల్పన చేశారన్నారు.
అనంతరం మహాత్మా జ్యోతిబా పూలే, డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సామాజిక పరివర్తన ర్యాలీని ప్రారంభించారు.


ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, ట్రెయిని ఐపీఎస్ అవినాష్ కుమార్, జిల్లా సాంఘీక సంక్షేమ అధికారి కె. సత్యనారాయణ, ఇడి ఎస్సి కార్పొరేషన్ శ్రీనివాసరావు, జెడ్పి సిఇఓ వివి. అప్పారావు, సిపిఓ శ్రీనివాసరావు, జిల్లా ఉపాధికల్పనాధికారి శ్రీరామ్, డా. బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటి కన్వీనర్ గులగట్టు ఎల్లయ్య, కో-కన్వీనర్లు తూరిగంటి అంజయ్య, బందేల నాగలక్ష్మి, గుర్రం మనోజ్, మాచర్ల ఏసోబు, దాసరి శ్రీను, కామా ప్రభాకర్, నాయకులు పగడాల నాగరాజు, లింగాల రవికుమార్, కత్తి నెహ్రు, డా. కృష్ణారావు, సంఘాల నాయకులు, ప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page