ఆధారాలు ఉన్నా అవినాష్‌ను జగన్‌ కాపాడుతున్నారు: వైఎస్‌ షర్మిల

Spread the love

మైదుకూరు: వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి సీఎం జగన్‌ (YS Jagan) వారసుడే కాదని ఏపీ పీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల (YS Sharmila) విమర్శించారు. బస్సు యాత్రలో భాగంగా వైఎస్‌ఆర్‌ జిల్లా మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారి మఠంలో ఆమె మాట్లాడారు..

వైఎస్‌ పాలనతో జగన్‌ పాలనకు పొంతనే లేదన్నారు. భూతద్దం పెట్టి చూసినా ఆ ఆనవాళ్లు కనిపించవని చెప్పారు. మాజీ మంత్రి వివేకా హత్య కేసు (Viveka Murder Case)లో ఎంపీ అవినాష్‌రెడ్డి నిందితుడని సీబీఐ చెప్పిందని.. కాల్ రికార్డులు, గూగుల్‌ మ్యాప్స్‌, లావాదేవీలు ఉన్నట్లు పేర్కొందని గుర్తుచేశారు. అన్ని ఆధారాలు ఉన్నా అతడిని జగన్‌ కాపాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

హంతకులకు ఓటు వేయొద్దు..

”వైకాపా పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ధరల స్థిరీకరణ అని చెప్పి జగన్‌ మోసం చేశారు. వైఎస్‌ఆర్‌ హయాంలో రైతు రారాజు.. ఇప్పుడు అప్పులేని రైతే లేడు. పంట నష్టం జరిగితే రూపాయి కూడా పరిహారం రావడం లేదు. డ్రిప్‌ వేసుకోవడానికీ అవకాశం లేకుండా సబ్సిడీలన్నీ ఆపేశారు. సంపూర్ణ మద్య నిషేధం హామీ ఇచ్చారు.. కానీ ప్రభుత్వమే విక్రయిస్తోంది. ఇష్టారీతిన అమ్ముతున్నారు. కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. 2.30లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానని జగన్‌ హామీ ఇచ్చారు. మెగా డీఎస్సీ వేస్తామని చెప్పారు. నాలుగున్నరేళ్లు నిద్రపోయి కేవలం 6వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. జగన్‌ది హత్యా రాజకీయాలు చేసే పాలన. సొంత బాబాయిని చంపిన నిందితులను కాపాడుతున్నారు. నిందితుడిగా ఉన్న అవినాష్‌కే మళ్లీ టికెట్‌ ఇచ్చారు. అతడు చట్టసభల్లోకి వెళ్లకూడదు. అన్యాయాన్ని ఎదిరించేందుకే ఎంపీగా పోటీచేస్తున్నా. న్యాయం కోసం పోరాటం ఓ వైపు.. హంతకులు మరో వైపు.. ప్రజలు ఎవరిని గెలిపిస్తారో ఆలోచించాలి. హంతకులకు ఓటు వేయొద్దు. వైఎస్‌ఆర్‌ బిడ్డను గెలిపించాలని కోరుతున్నా. ఏ కష్టం వచ్చినా అందుబాటులో ఉంటా” అని షర్మిల అన్నారు.

వివేకాను చంపి మమ్మల్ని రోడ్ల పాల్జేశారు: సునీత

ఆడది అంటే నారీ శక్తి అని వివేకా కుమార్తె సునీత అన్నారు. తమను అలాగే పెంచారని చెప్పారు. షర్మిలతో కలిసి బస్సుయాత్రలో పాల్గొన్న ఆమె మాట్లాడారు. ”తప్పు అంటే తప్పు అని చెప్పే మనస్తత్వం మాది. వివేకాను ఎవరు హత్య చేశారో అందరికీ తెలుసు. న్యాయం కోసం పోరాడుతున్నాం. ఆయన్ను చంపి మమ్మల్ని రోడ్ల పాల్జేశారు. షర్మిలను ఎంపీగా చూడాలనేది వివేకా కోరిక. ప్రజలు భారీ మెజారిటీతో ఆమెను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నా” అని సునీత అన్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page