జిల్లాల్లో భూ క్రమబద్ధీకరణ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలి.

Spread the love

జిల్లాల్లో భూ క్రమబద్ధీకరణ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలి.

  • రెవిన్యూ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి నవీన్ మిట్టల్

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ :

జిల్లాల్లో భూ క్రమబద్ధీకరణ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని రెవిన్యూ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి నవీన్ మిట్టల్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుండి జిల్లా కలెక్టర్ లు, రెవెన్యూ అధికారులు, తహసిల్దార్ లతో వీడియో సమావేశం నిర్వహించి జీఓ 58, 59, 76, 118 క్రింద భూ క్రమబద్దికరణ, ధరణి పెండింగ్ దరఖాస్తులు, ధరణి లో నూతన ఆప్షన్ పై ప్రిన్సిపల్ కార్యదర్శి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జీఓ 59 క్రింద గతంలో వచ్చిన దరఖాస్తులలో 10 లక్షల కంటే అధికంగా చెల్లించాల్సిన 1459 దరఖాస్తుదారులు ఇప్పటి వరకు చెల్లింపులు ప్రారంభించలేదని, వెంటనే వారికి నోటీసులు జారీ చేసి చెల్లింపు చేయని పక్షంలో భవన నిర్మాణాల కూల్చివేతలు ప్రారంభించాలని ఆయన సూచించారు.

జీఓ 59 క్రింద లక్ష లోపు చెల్లించాల్సిన 3689 దరఖాస్తుదారులకు సైతం నోటీసు అందించి త్వరితగతిన చెల్లింపు చేసేలా అవగాహన కల్పించాలని ఆయన తెలిపారు. ప్రభుత్వం చాలా తక్కువ ధరకు భూ క్రమబద్ధీకరణ చేస్తున్నప్పటికీ అలసత్వం వహించడం సరికాదని, లబ్ధిదారులు ముందుకు వచ్చి చెల్లింపులు ప్రారంభించాలని ఆయన పేర్కొన్నారు. జీఓ 58 క్రింద గతంలో 20 వేల 668 మంది లబ్ధిదారులకు పట్టాలను ఉచితంగా పంపిణీ చేసేందుకు సిద్ధం చేశామని, వాటిలో 561 పట్టాల పంపిణీ ఇంకా పెండింగ్ ఉందని దీనిని రెండు రోజుల్లో పూర్తి చేయాలని ఆయన సంబంధిత కలెక్టర్ లకు సూచించారు. భూముల క్రమబద్ధీకరణ కటాఫ్ తేదీని 2 జూన్ 2020 కు పొడిగిస్తూ జీఓ 58, 59 ,76 కింద ప్రభుత్వం మరో మారు దరఖాస్తులను స్వీకరించిందని, జీఓ 58 కింద 1,20,357 జీఓ 59 కింద 57,661, జిఓ 76 కింద 11, 810 దరఖాస్తులు వచ్చాయని, వీటిని క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టేందుకు బృందాలను ఏర్పాటు చేసి నెలరోజుల వ్యవధిలో క్షేత్రస్థాయి విచారణ ద్వారా అర్హులను ఎంపిక చేయాలని ఆయన సూచించారు.

జీఓ 118 కింద పెండింగ్ ఉన్న దరఖాస్తులు 15 రోజుల పూర్తి చేయాలని అన్నారు. ధరణి కింద పెండింగ్ ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ లకు ఆయన సూచించారు. భూ సమస్యల పరిష్కారం కోసం దరణిలో కొత్తగా ఐదు మాడ్యూల్స్ అందుబాటులోకి తెచ్చామని, ధరణి సేవలను విస్తృతం చేయడంతో పాటు చిన్న, చిన్న లోపాలను సవరించడం జరుగుతుందని తెలిపారు. ఆర్.ఎస్.ఆర్. ప్యురిఫికేషన్ కోసం ముందస్తుగా 5 ఎకరాల పై ఉన్న 12,546 కేసులను మండలాల వారిగా గుర్తించి సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మిస్సింగ్ సర్వే నెంబర్లు, విస్తీర్ణ సవరణ దరఖాస్తులలో ఆర్.ఎస్.ఆర్ విస్తిర్ణం, ప్రస్తుతం ఉన్న సర్వే నెంబర్ లు పరిశీలించి పరిష్కరించాలని ఆయన తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న అదనపు కలెక్టర్లు స్నేహాలత మొగిలి, ఎన్. మధుసూదన్ లు మాట్లాడుతూ, జివో 59 క్రింద డిమాండ్ చెల్లింపుకు నోటీసులు జారీ చేసినట్లు, వసూళ్లకు చర్యలు వేగవంతం చేశామన్నారు. ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం చేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ సమావేశంలో శిక్షణా సహాయ కలెక్టర్ రాధిక గుప్తా, డిఆర్వో ఆర్. శిరీష, కల్లూరు ఆర్డీవో సిహెచ్. సూర్యనారాయణ, తహశీల్దార్లు శైలజ, శ్రీనివాసరావు, కలెక్టరేట్ ఏవో అరుణ, సూపరింటెండెంట్లు మదన్ గోపాల్, వెంకటేశ్వర్లు, రెవెన్యూ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page