ఉద్యోగి సత్యనారాయణది ఆత్మహత్య కాదని, ఒకరకంగా హత్య అని రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా

Spread the love

సత్యనారాయణది ముమ్మాటికి హత్యే…

పేపరు మిల్లులోని పరంపర వ్యవహారాలే బలితీసుకున్నాయి..

మిల్లు ఉన్నతోద్యోగులు,కార్మిక నేతలు, ప్రజాప్రతినిధులే కారకులు..

మృతుడి కుటుంబానికి రూ.కోటి పరిహారమివ్వాలి..

ఇద్దరు అల్లుళ్లకు మిల్లులో ఉద్యోగాలివ్వాలి
..

పరంపర వ్యవహారాలపై పూర్తిస్థాయి దర్యప్తు జరపాలి..

వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా…

రాజమహేంద్రవరం: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం పేపరు మిల్లులో శనివారం చోటుచేసుకున్న ఉద్యోగి సత్యనారాయణది ఆత్మహత్య కాదని, ఒకరకంగా హత్య అని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆరోపించారు. పేపరు మిల్లులో ఉద్యోగాలు అమ్ముకోవడం అనే ఒక వికృత పరంపరకు తెరలేపిన మిల్లులోని కొందరు ఉన్నత ఉద్యోగులు, కార్మిక సంఘ నేతలు, ప్రజాప్రతినిధులు సత్యనారాయణపై మానసిక ఒత్తిడి తీసుకురావడంవల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకుందన్నారు. వారంతా ఈ హత్యకు బాధ్యత వహించాలన్నారు. పేపరు మిల్లులో ఉద్యోగి సత్యనారాయణ ఆత్మహత్య సమాచారం తెలిసిన వెంటనే జక్కంపూడి రాజా హుటాహుటిన మిల్లుకు చేరుకున్నారు. ఉరికి వేలాడుతున్న సత్యనారాయణ మృతదేహాన్ని పరిశీలించారు. బాధితుడి కుటుంబ సభ్యులను ఓదార్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు అధికారులతో మాట్లాడారు.అనంతరం ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదలచేశారు.

చేయని నేరానికి అన్యాయంగా బలైపోయిన మృతుడు సత్యనారాయణ కుటుంబానికి ఫ్యాక్టరీ యాజమాన్యం కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని జక్కంపూడి రాజా డిమాండుచేశారు. అలాగే మృతుడికి ఇద్దరు వివాహమైన కుమార్తెలు ఉన్నందున అల్లుళ్లకు పేపరు మిల్లులో ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండుచేశారు. ఆంధ్ర పేపరు మిల్లులో గత కొంత కాలంగా జరుగుతున్న పరంపర వ్యవహారాలపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపించాలని రాజా డిమాండు చేశారు.

పేపరు మిల్లులో గత కొంతకాలంగా పరంపర పేరుతో ఉద్యోగులు తమ ఉద్యోగాలను ఇతరులకు అమ్ముకోవడమే ఒక దారుణమైన క్రీడను ఒకరిద్దరు ఉన్నతోద్యోగులు, కార్మిక సంఘ నేతలు, కొందరు ప్రజాప్రతినిధులు సంయుక్తంగా ప్రారంభించారని రాజా పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో మిల్లులోని సీనియర్ ఉద్యోగులకు, కాంట్రాక్టు ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయం విషయమై పలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కొంత కాలంగా జరుగుతున్న ఉద్యమానికి తాను సైతం మద్దతిచ్చిన విషయాన్ని ఆయన ఈసందర్భంగా గుర్తుచేశారు.

పరంపర పేరుతో విచ్చలవిడిగా జరిగిన ఉద్యోగాల అమ్మకాల వ్యవహారంలో జరిగిన ఆర్థిక లావాదేవీల్లో ఫ్యాక్టరీకి చెందిన పలువురు సీనియర్ ఉద్యోగులు ఇరుక్కుని విపరీతమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారని రాజా తెలిపారు. ఫ్యాక్టరీలో కీలక బాధ్యతల్లో ఉన్న కొందరు తెలివిగా ఈ ఆర్థిక వ్యవహారాల్లో సీనియర్ ఉద్యోగులను ఇరికించి, వారిని తీవ్రమైన మానసిక క్షోభకు గురిచేస్తున్నారన్నారు. ఆత్మహత్య చేసుకోవడంవల్ల సత్యనారాయణ వ్యవహారం వెలుగుచూసిందని, పేపరు మిల్లులో ఇలా ఇంకా ఎందరో ఉద్యోగులు తీవ్ర మానసిక ఒత్తిళ్లకు గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు. అయితే బెదిరింపుల కారణంగా ఉద్యోగులు తమ బాధను బహిర్గతం చేయలేకపోతున్నారన్నారు.

ఒక మహిళా ఉద్యోగి పరంపర పథకంలో తన ఉద్యోగాన్ని అమ్ముకోవడానికి సిద్ధపడిన వ్యవహారంలో సత్యనారాయణను సైతం ఇలాగే ఇరికించారన్నారు. అయితే నగదు చేతులు మారి, కొనుగోలు చేసిన వ్యక్తికి ఉద్యోగం రాకముందే అనారోగ్యం కారణంగా ఆ మహిళా ఉద్యోగి చనిపోయారన్నారు. దీనితో సదరు ఆర్థిక లావాదేవీలతో ఏ మాత్రం సంబంధం లేని సత్యనారాయణను బాధ్యుడిని చేస్తూ, తిరిగి చెల్లించవలసిందిగా ఒత్తిడి చేశారన్నారు. అలాగే కొందరు ఫ్యాక్టరీ ఉన్నతాధికారులైతే సత్యనారాయణ ఉద్యోగానికి రాజీనామా చేస్తే,ఆ ఉద్యోగం సదరు కొనుగోలు చేసిన వ్యక్తికి వస్తుందని ఒత్తిడి చేస్తున్నారని మృతుడి కుటుంబ సభ్యులు చెబుతున్నారన్నారు. ఈ మానసిక ఒత్తిళ్లను భరించలేక శనివారం విధి నిర్వహణకు వచ్చిన సత్యనారాయణ ఫ్యాక్టరీలోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారన్నారన్నారు. సత్యనారాయణది పూర్తిగా పరంపర హత్య అని రాజా ఆరోపించారు.

ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలని, సత్యనారాయణ ఆత్మహత్యచేసుకోవడానికి కారకులైన ఫ్యాక్టరీ ఉన్నతోద్యోగులు,కార్మిక నేత ముసుగులో ఉన్న కొందరు,ప్రజాప్రతినిధుల పైనా కేసు నమోదుచేయాలని జక్కంపూడి రాజా డిమాండ్ చేశారు.

Print Friendly, PDF & Email

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page