SAKSHITHA NEWS

జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో.. రోజువారీ విచారణ సీబీఐ కోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశం

తెలంగాణ హైకోర్టు పర్యవేక్షించాలని సూచన ఎమ్మెల్యే, ఎంపీల కేసులపై సుప్రీంకోర్టు తీర్పు ఈ కేసులకూ వర్తిస్తుందని స్పష్టీకరణ

వేరే రాష్ట్రానికి బదిలీ చేయక్కర్లేదని వెల్లడి విచారణకు జగన్‌ అడ్డుపడుతున్నారు

పదేళ్లుగా బెయిల్‌పైనే ఉన్నారు బయట ఉండి ప్రభావితం చేస్తున్నారు

కోర్టుకు హాజరుకాకుండా మినహాయింపుపై సీబీఐ కూడా సవాల్‌ చేయలేదు పదేళ్ల నుంచి ట్రయల్‌ ఒక్కడుగూ ముందుకు పడలేదు

సుప్రీంకోర్టు, హైకోర్టు స్పష్టంగా ఆదేశించినా జాప్యమే డిశ్చార్జ్‌ పిటిషన్లపై వాదనలు విన్న ఐదుగురు జడ్జీలు నిర్ణయం వెలువరించకుండానే బదిలీ అయ్యారు

రఘురామ తరఫు సీనియర్‌ న్యాయవాది నివేదన ఇది రాజకీయ పిటిషన్‌ అన్న ముకుల్‌ రోహత్గీ

బెయిల్‌ రద్దు పిటిషన్‌ ఉపసంహరించుకున్న రఘురామ

వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో రోజువారీ విచారణ చేపట్టాలని ట్రయల్‌ కోర్టు(సీబీఐ ప్రత్యేక కోర్టు)ను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. కేసుల విచారణ తీరును పర్యవేక్షించాలని తెలంగాణ హైకోర్టుకు సూచించింది. జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలని 2023 అక్టోబరు 6న, ఆయన అక్రమాస్తుల కేసును వేరే రాష్ర్టానికి బదిలీ చేయాలని అదే ఏడాది నవంబరు 1న అప్పటి వైసీపీ ఎంపీ, ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆ రెండు పిటిషన్లను కలిపి జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది బాలాజీ శ్రీనివాసన్‌ వాదనలు వినిపించారు.

కేసుల విచారణ జరగకుండా జగన్‌ అడ్డుపడుతున్నారని తెలిపారు. బెయిల్‌ మంజూరైన తర్వాత కోర్టుకు హాజరు కావడం లేదని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. జగన్‌ మాజీ ముఖ్యమంత్రి అని, ఆయన బెయిల్‌పై బయట ఉండడంతో విచారణకు అంతరాయం కలిగిస్తున్నారని, ప్రభావితం చేస్తున్నారని తెలిపారు. వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకాకుండా ఆయనకు మినహాయింపునిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సీబీఐ కూడా సవాల్‌ చేయలేదని గుర్తు చేశారు. పదేళ్లుగా ట్రయల్‌ ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదన్నారు. డిశ్చార్జ్‌ పిటిషన్లపై వాదనలు విని, ఎటువంటి నిర్ణయం వెలువరించకుండానే ఐదుగురు న్యాయాధికారులు బదిలీ అయ్యారని గుర్తుచేశారు. కనీసం ఒక్క డిశ్చార్జ్‌ పిటిషన్‌పైనా తుది నిర్ణయం రాలేదన్నారు. కేసుల బదిలీ సాధ్యం కాదని సుప్రీంకోర్టు గత విచారణలోనే చెప్పిందని.. తామిప్పుడు కేసు విచారణ త్వరగా చేపట్టాలని, పర్యవేక్షణ పూర్తి స్థాయిలో జరగాలని కోరుతున్నామని శ్రీనివాసన్‌ తెలిపారు. గత పదేళ్లుగా జగన్‌ బెయిల్‌పైనే ఉన్నారని, సుప్రీంకోర్టు, హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చినా ట్రయల్‌లో జాప్యం జరుగుతోందని, సీబీఐ కోర్టు శుక్ర, శనివారాల్లోనే కేసును విచారిస్తోందని మరోసారి ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. జగన్‌ అక్రమాస్తుల కేసుల వివరాలు, ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ సీబీఐ సమగ్ర అఫిడవిట్‌ దాఖలు చేసినట్లు దర్యాప్తు సంస్థ తరపు న్యాయవాది వివరించారు.

జగన్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. కేసుల విచారణను హైకోర్టు పర్యవేక్షిస్తోందని, ట్రయల్‌ కోర్టులో డిశ్చార్జ్‌ పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని, ఇది రాజకీయపరమైన పిటిషన్‌ అని తెలిపారు. అన్ని పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. తెలంగాణ హైకోర్టు జగన్‌ అక్రమాస్తుల కేసును పర్యవేక్షిస్తున్నందున కేసులను వేరే రాష్ర్టానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. గతంలో ఎమ్మెల్యే, ఎంపీల కేసుల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఈ కేసులకు కూడా వర్తిస్తుందని స్పష్టంచేసింది. ట్రయల్‌ కోర్టు రోజువారీ విచారణ చేపట్టాలని, హై కోర్టు కూడా పర్యవేక్షించాలని ఆదేశిస్తూ పిటిషన్‌ను డిస్మిస్‌ చేస్తున్నట్టు ప్రకటించింది. అలాగే హైకోర్టు పర్యవేక్షణ నేపథ్యంలో జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలన్న పిటిషన్‌పై ప్రత్యేకంగా విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని పేర్కొంది. అందుకే పిటిషన్‌ను డిస్మిస్‌ చేయాలా.. ఉపసంహరించుకుంటారా అని ర ఘురామ తరఫు సీనియర్‌ న్యాయవాదిని ప్రశ్నించింది. దీంతో పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్న ట్లు శ్రీనివాసన్‌ తెలుపగా.. ధర్మాసనం అంగీకరించింది. గతం లో జగన్‌ అక్రమాస్తుల కేసులను జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా, జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌తో కూడిన ధర్మాసనం విచారించగా.. అనూహ్యంగా గత విచారణ నుంచి ఆ కేసులు జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ సతీష్‌ చంద్రశర్మ ధర్మాసనానికి బదిలీ అయిన విషయం విదితమే..

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app