ఎన్నికల కోడ్ తేదీ నుండి…పోలీసుల తనిఖీ

Spread the love

ఎన్నికల కోడ్ తేదీ నుండి…పోలీసుల తనిఖీ లలో రోజుకు రూ. 100 కోట్లు పైగా స్వాధీనం.. చరిత్రలో నే రికార్డు దిశగా ఈసీ రికవరి చేసిన సొమ్ము మొత్తం రూ.4650 కోట్ల పై మాటే?

ఓటర్లకు నేరుగా నగదు పంపిణీ నుంచి మొదలుపెట్టి మద్యం, మాదక ద్రవ్యాలు, బంగారం, వెండి వంటి విలువైన లోహాలు, ఖరీదైన బహుమతుల రూపంలో ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉంటుంది.

దీన్ని అరికట్టేందుకు ఈసీ ప్రతి రాష్ట్రంలో జనరల్ అబ్జర్వర్లతో పాటు పోలీస్ అబ్జర్వర్లను పెట్టి, ప్రభుత్వ యంత్రాంగంతో ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో ప్రతిరోజూ దేశంలో అనేక ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో నగదు, మద్యం, మాదక ద్రవ్యాల రూపంలో రికవరీ జరుగుతోంది.

మార్చి 1 నుంచి ఇప్పటి వరకు లెక్కేస్తే మొత్తం రూ. 4,650 కోట్ల విలువైన రికవరీ చేసినట్టు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.

ఇందులో నగదు రూపంలో రూ. 395.39 కోట్లు స్వాధీనం చేసుకోగా,

బంగారం – ఇతర విలువైన లోహాల రూపంలో రూ. 562.10 కోట్లు రికవరీ చేసినట్టు ఈసీ వెల్లడించింది.

అలాగే మద్యం రూపంలో రూ. 489.31 కోట్లు విలువచేసే 3.58 కోట్ల లీటర్లు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించింది.

గంజాయి నుంచి మొదలుపెట్టి కొకైన్ వరకు వివిధ రూపాల్లో ఉన్న మాదకద్రవ్యాలను కూడా ఈసీ అధికారులు భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు.

మొత్తం జరిగిన రికవరీల్లో రూ. 2,068.85 కోట్లు విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.

అంటే.. రికవరీల్లో సింహభాగం (45% ) వాటా మాదకద్రవ్యాలదే అని అర్థమవుతోంది.

ఇక టీవీలు, ఫ్రిడ్జిలు, మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు, బహుమతుల రూపంలో రూ. 1,142.49 కోట్ల మేర స్వాధీనం చేసుకున్నామని వివరించింది.

గత సార్వత్రిక ఎన్నికల్లో (2019) మొత్తం కలిపి ఈసీ స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ రూ. 3,475 కాగా, ఆ రికార్డును ఈసీ ఇప్పటికే అధిగమించి దూసుకెళ్తోంది. జూన్ 1తో ముగియనున్న 7 విడతల ఎన్నికల నాటికి ఈసీ ఇంకా ఎంత మొత్తంలో రికవరీ చేసుకుంటుంది అన్నది ఊహకే అందడం లేదు. సమగ్ర ప్రణాళిక, సంయుక్త కార్యాచరణ, దర్యాప్తు సంస్థలు, భద్రతా బలగాల మధ్య సమన్వయంతో పాటు పౌరుల సహకారంతోనే ఇంత పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకోగల్గుతున్నామని ఈసీ ఒక ప్రకటనలో పేర్కొంది.

రికవరీల్లో రాజస్థాన్, గుజరాత్ టాప్..
దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు వివిధ రూపాల్లో ఈసీ స్వాధీనం చేసుకున్న మొత్తం రూ. 4,658 కోట్లలో అత్యధికంగా రాజస్థాన్ నుంచి రూ. 778.52 కోట్లు స్వాధీనం చేసుకోగా, ఆ తర్వాతి స్థానంలో రూ. 605 కోట్లతో గుజరాత్ ద్వితీయ స్థానంలో నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ నుంచి రూ. 121.84 కోట్ల మేర రికవరీ చేసుకోగా, ఆంధ్రప్రదేశ్ నుంచి రూ. 125.97 కోట్లు స్వాధీనం చేసుకున్నట్టు ఈసీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఎన్నికల అక్రమాలు, అవకతవకల్లో అత్యల్పంగా లద్దాక్, లక్షద్వీప్ ప్రాంతాలు నిలిచాయి.

Related Posts

You cannot copy content of this page