ఒకటి నుండి 19 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు నులిపురుగు నివారణ మాత్రలు వేయాలి.

Spread the love

ఒకటి నుండి 19 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు నులిపురుగు నివారణ మాత్రలు వేయాలి.
జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ఒకటి నుండి 19 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు నులిపురుగు నివారణ మాత్రలు వేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. జూలై 20 గురువారం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం పురస్కరించుకుని, ఐడిఓసి లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్, జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశాన్ని నిర్వహించి, జిల్లా కార్యాచరణ ప్రణాళికపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నులిపురుగుల వల్ల పిల్లల్లో రక్తహీనత, సరైన ఎదుగుదల ఉండదని, వీటిని నియంత్రించి, ఆరోగ్య సమాజం నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆల్బండొజల్ మాత్రల వల్ల ఎటువంటి హానీ ఉండదని, నులిపురుగులను అరికట్టడానికి ఒకటి నుండి 19 సంవత్సరాల వయస్సు కలిగిన ప్రతి ఒక్కరికి ఈ మాత్రలు వేయాలని ఆయన తెలిపారు. ఈ మాత్రల వల్ల పిల్లల్లో వచ్చే రక్తహీనత, పోషకాహార లోపం, ఆకలి లేకపోవడం, బలహీనత, బరువు తగ్గడం, కడుపునొప్పి ఇలాంటి వాటిని నివారించవచ్చని కలెక్టర్ అన్నారు. పిల్లల ఆరుబయట వట్టి కాళ్ళతో ఆడుకోవడం, మట్టిలో ఆడి చేతులు కడుక్కోకుండా భోజనం చేయడం, పరిసరాలను అపరిశుభ్రంగా ఉంచడం లాంటి వాటివల్ల నులిపురుగులు తయారవుతాయని, పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రతపై పిల్లల్లో అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో 3,11,317 మంది ఒకటి నుండి 19 సంవత్సరాల వయస్సు పిల్లలు ఉన్నట్లు, వీరందరికి నేడు మాత్రలు అందేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అన్నారు. భోజనం తర్వాత ఒకటి నుండి 2 సంవత్సరాల వయస్సు వారికి సగం మాత్ర, రెండు నుండి మూడు సంవత్సరాల పిల్లలకు ఒక మాత్ర క్రష్ చేసి ఇవ్వాలని, 3 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వయస్సు వారికి మాత్ర మ్రింగించాలని ఆయన తెలిపారు. ఇట్టి కార్యక్రమానికి ప్రజాప్రతినిధులను ఆహ్వానించి, వారిని భాగస్వామ్యం చేయాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా జాతీయ నులిపురుగుల నిర్మూలన దినం కు సంబంధించి రూపొందించిన పోస్టర్ ను కలెక్టర్ ఆవిష్కరించారు.
ఈ సమావేశంలో జిల్లా వైద్య, ఆరోగ్య అధికారిణి డా. బి. మాలతి, జెడ్పి సిఇఓ అప్పారావు, డీఆర్డీఓ విద్యాచందన, డిసిహెచ్ఓ డా. వెంకటేశ్వర్లు, సాంఘీక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు కె. సత్యనారాయణ, గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు కృష్ణ నాయక్, జిల్లా ఇంటర్ మీడియట్ అధికారి రవిబాబు, జిల్లా సంక్షేమ అధికారిణి జి. జ్యోతి, సిఎంఓ రాజశేఖర్, ప్రోగ్రాం అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page