SAKSHITHA NEWS

An era in Chitra Seema ended with Krishna’s death.

కృష్ణ మృతితో చిత్ర సీమలో ఒక శకం ముగిసింది.
కృష్ణ మృతికి ఎంపీ నామ సంతాపం
ఆయన మృతి సినీ రంగానికి తీరని లోటు
విలక్షణ నటుడు కృష్ణ మృతికి టీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు నివాళి

సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:

తెలుగు లెజెండరీ దిగ్గజ నటుడు నూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ హఠాన్మరణం పట్ల టీఆర్ఎస్ లోక్ సభా పక్షనేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు మంగళశారం ఒక ప్రకటనలో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, సంతాపం తెలిపి, విచారం వ్యక్తం చేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ నివాళులు అర్పించారు.

కృష్ణ కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు నామ పేర్కొన్నారు. తన అద్భుత నటనా కౌశలతో ఉన్నతమైన, స్నేహపూర్వకమైన వ్యక్తిత్వంతో ప్రజల హృదయాలను గెలుచుకున్న లెజెండరీ సూపర్ స్టార్ పవిత్ర ఆత్మకు సద్గతులు , శాంతి కలగాలని నామ ఆకాంక్షించారు. ఆయన మృతితో చలన చిత్ర సీమలో ఒక శకం ముగిసిందన్నారు.

తన విలక్షణ నటనతో ఎందరి హృదయాలలో గెలుచుకున్నారని, ఆయన మరణం సినిమా, ఎంటర్టైన్మెంట్ రంగానికి తీరని లోటన్నారు. కృష్ణ అంటే సాహాసానికి మరో పేరు అన్నారు. 300 చిత్రాలకు పైగా నటించడమే కాకుండా దర్శకునిగా, నిర్మాతగా కీర్తి గడించారన్నారు. ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు, విలక్షణమైన పాత్రలే కాకుండా సాంకేతికంగా కూడా ఎప్పటికీ చిరస్మరణీయమని అన్నారు.

సినీ పరిశ్రమకు కొత్త టెక్నాలజీని పరిచయం చేసి, తెలుగు సినిమాలో విప్లవాత్మక మార్పులు తెచ్చారని అన్నారు. తొలి 70 ఎం.ఎం. రంగుల చిత్రం ఆయన తెచ్చినదేనని అన్నారు. సినిమాలను సాంకేతికంగా కొత్త పుంతలు తొక్కించిన నట కిరీటి కృష్ణ అన్నారు. కేవలం నటుడుగానే కాకుండా నాకు మంచి స్నేహితుడని.

నా కుటుంబానికి ఎంతో ఆప్తుడు అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ అభిమాన సంఘాలు కలిగిన ఏకైక నటుడు ఆయన అన్నారు. కృష్ణ కుటుంబంలో ఈ ఏడాది ముగ్గురు చనిపోవడం బాధాకరమని, వారి కుటుంబ సభ్యులకు దేవుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలన్నారు.

కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు ఒక గొప్ప సందేశాత్మక చిత్రం అన్నారు. అందులో ఆయన నటన అత్భుతమన్నారు. భూదేవంత ఒదిగిన వినయానికి, నిలువెత్తు నిదర్శనం కృష్ణ అని కొనియాడారు. ఆయన ఘనకీర్తి తెలుగు జాతి ఉన్నంత వరకు ఆచంద్రతారార్కమై వెలుగొందుతుందని పేర్కొన్నారు.

వృత్తి పట్ల ఆయనకున్న నిబద్ధత ప్రజలకు ఆదర్శమన్నారు. కేవలం వెండితెర పైనే కాదు.. ప్రేమ, మానవత్వం, ఆప్యాయత పంచడంలోనూ ఆయన సూపర్ స్టారేనని అన్నారు. ఆయన చేసిన ఎన్నో మంచి పనులు ద్వారా మన మధ్య జీవించే ఉంటారన్నారు. ఒక సినీ శక్తిగా మారి, పరిశ్రమలో సూపర్ స్టార్ గా ఎదిగిన కృష్ణ సినీ కళామతల్లి ముద్దుబిడ్డ అని, తెలుగు జాతి ఎన్నటికీ మరువలేని అమరజీవి అని అన్నారు. ఏలూరు ఎంపీగా విశిష్టమైన సేవలందించారని ఎంపీ నామ గుర్తు చేసుకున్నారు.


SAKSHITHA NEWS