SAKSHITHA NEWS

జిల్లాలో మత్స్య సంపద పెంపుకై ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి.

-జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

జిల్లాలో మత్స్య సంపద పెంపుకై ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. శుక్రవారం ఐడిఓసి లోని సమావేశ మందిరంలో అధికారులు, ఆక్వా రైతులతో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, ఆక్వా కల్చర్ జిల్లా స్థాయి సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నీలి విప్లవం, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ల ద్వారా మత్స్యకారుల అభివృద్ధికి చర్యలు చేపట్టుతున్నట్లు తెలిపారు.

ఈ పథకాల క్రింద చేపల చెరువుల నిర్మాణం, చేపల సీడ్ హాచరీలు, చేపల సీడ్ రియరింగ్ యూనిట్ల నిర్మాణం, చేపల కల్చర్ కు ఇన్ పుట్ కాస్ట్ లకు ఎస్సి, ఎస్టీ లకు 60 శాతం, ఇతరులకు 40 శాతం సబ్సిడీ అందజేస్తున్నట్లు ఆయన అన్నారు. జిల్లాలో నీలి విప్లవం క్రింద చేపల సీడ్ రియరింగ్ యూనిట్లకు 32 దరఖాస్తులు, చేపల సీడ్ హాచరికి ఒకటి, ఆర్ఏఎస్ కి ఒక దరఖాస్తు వచ్చాయన్నారు. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన క్రింద చేప సీడ్ రియరింగ్ యూనిట్ల కొరకు 6 దరఖాస్తులు, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన క్రింద క్రొత్త చేపల చెరువుల నిర్మాణానికి 11, ఆర్ఏఎస్ కి 3, బయో ఫ్లోక్ కి 2 దరఖాస్తులు అందినట్లు ఆయన అన్నారు. దరఖాస్తుదారులు వారి పేరుపై భూమికి క్లియర్ టైటిల్ కల్గివుండాలని, లీజుదారుడైతే కనీసం 5 సంవత్సరాల కాలపరిమితి లీజు కల్గివుండాలని ఆయన తెలిపారు.

ఆక్వా రైతులకు పథకాలపై అవగాహన కల్పించాలని, వచ్చిన దరఖాస్తుల క్షేత్ర పరిశీలన ప్రక్రియ పూర్తి చేసి, త్వరితగతిన గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఈ సమావేశంలో జిల్లా మత్స్య అధికారి ఆంజనేయ స్వామి, జెడ్పి సిఇఓ అప్పారావు, డిఆర్డీఓ విద్యాచందన, జిల్లా వ్యవసాయ అధికారిణి విజయనిర్మల, జిల్లా నీటిపారుదల అధికారి వెంకట్రాం, మత్స్య, వ్యవసాయ, నీటిపారుదల శాఖ అధికారులు, ఆక్వా రైతులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS