ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్ధులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలనే లక్ష్యం

Spread the love

The aim is to create a pleasant environment for students in government schools

సాక్షిత : ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్ధులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం మన బస్తి మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

మాసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయ ఆవరణలోని కార్యాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అద్యక్షతన మన బస్తీ మన బడి కార్యక్రమం అమలుపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన, MLC సురభి వాణిదేవి, MLA లు దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, సాయన్న, కౌసర్ మొహినోద్దిన్, మౌజం ఖాన్, TSEWIDC చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి రోహిణి, డిప్యూటీ DEO లు, ఇంజనీరింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి నియోజకవర్గాల వారిగా పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు విద్యార్ధులకు అవసరమైన పర్నిచర్, త్రాగునీటి సౌకర్యం, విద్యుత్, టాయిలెట్స్ వంటి సౌకర్యాలు, తరగతి గదులు, పాఠశాల భవనాల మరమ్మతులు, ప్రహారీగోడ నిర్మాణం వంటి అభివృద్ధి పనులు చేపట్టాలనే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆలోచనల మేరకు మన బస్తి మన బడి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని వివరించారు.

ఈ కార్యక్రమం క్రింద రాష్ట్ర వ్యాప్తంగా 26,065 పాఠశాలలు ఉండగా, మొదటి విడతగా 9, 123 పాఠశాలలను ఎంపిక చేసి పనులు చేపట్టినట్లు వివరించారు. అదేవిధంగా హైదరాబాద్ జిల్లాలోని 15 నియోజకవర్గాల పరిధిలో 499 ప్రాథమిక, 9 ప్రాథమికోన్నత, 182 ఉన్నత పాఠశాలలు మొత్తం 690 పాఠశాలలు ఉండగా, 239 పాఠశాలలను ఎంపిక చేసినట్లు చెప్పారు. చేపట్టిన అభివృద్ధి పనులు మరింత వేగవంతంగా జరిగేలా విద్యాశాఖ అధికారులు పర్యవేక్షణ చేయాలని మంత్రి ఆదేశించారు.

డిప్యూటీ DEO లు వారంలో నాలుగు రోజుల పాటు మీ మీ పరిధిలోని పాఠశాలలను తనిఖీ చేసి పనులను పర్యవేక్షించడంతో పాటు అక్కడ నెలకొన్న సమస్యలు, విద్యార్ధుల ఇబ్బందులను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. టాయిలెట్స్, విద్యుత్ సౌకర్యం, త్రాగునీరు వంటి సౌకర్యాలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. పాఠశాలల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, సమస్యల పరిష్కారం కోసం సంబంధిత MLA ల దృష్టికి తీసుకెళ్ళాలని చెప్పారు.

పాఠశాలల వారిగా విద్యార్ధుల సంఖ్య, తరగతి గదుల సంఖ్య, చేపట్టవలసిన అభివృద్ధి పనులపై పూర్తిస్థాయి సమాచారంతో ఈ నెల 11 వ తేదీన జరిగే సమావేశానికి రావాలని అధికారులను ఆదేశించారు. కార్పోరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గతంలో ఉన్న ప్రభుత్వాలు పాఠశాలల్లోని సమస్యల గురించి పట్టించుకోలేదని అన్నారు. తెలంగాణా ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు.

Related Posts

You cannot copy content of this page