SAKSHITHA NEWS

Let’s come to Delhi and complain to the central government – BJP state president Somu Veerraju

విజయవాడ

ఢిల్లీకి రండి కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేద్దాం – బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు

ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు వైవిబి రాజేంద్రప్రసాద్ మరియు రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షురాలు శ్రీమతి వానపల్లి లక్ష్మీ ముత్యాలరావు ఆధ్వర్యంలో “సర్పంచ్ ల మరియు గ్రామాల సమస్యలపై అఖిల పక్షరౌండ్ టేబుల్ సమావేశం”

ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు వై.వి.బి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో సర్పంచుల సంఘం చేపట్టిన అన్ని ఉద్యమాలకు మా పార్టీ ల పూర్తి మద్దతు ఉంటుందని తెలియజేసిన నాయకులు.

విజయవాడలోని బాలోత్సవ భవన్లో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ మరియు ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన “సర్పంచ్ లు, గ్రామాల సమస్యలపైన అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం” లో ఆం.ప్ర. పంచాయతీరాజ్ ఛాంబర్ తరఫున పోరాడుతున్న ఆంధ్రప్రదేశ్ సర్పంచ్ ల సంఘానికి మా పార్టీల తరపున పూర్తి మద్దతు తెలియజేస్తున్నామని చెప్పిన బిజెపి, టీడీపీ, జనసేన, సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, బిఎస్పీ, జైభీమ్ మరియు తదితర పార్టీల నాయకులు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 12,918 గ్రామపంచాయతీలకు చెందిన సర్పంచులు, ప్రజలు చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులైన వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పైన ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం మరియు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు అయిన సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పిటిసిలు, ఎంపీపీలు, మరియు జిల్లా పరిషత్ చైర్మన్లు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పైన వారి హక్కులను సాధించుకోవడానికి చేస్తున్నటువంటి పోరాటానికి మా పార్టీ తరఫున మద్దతు తెలియజేస్తూ,గ్రామీణ ప్రజల సమస్యల పరిష్కారం కొరకు, పంచాయతీల బలోపేతం కొరకు మా సలహాలు, సూచనలు ఇస్తామని తెలియజేసిన వివిధ పార్టీల నాయకులు.

అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం యొక్క డిమాండ్లు అయినటువంటి…

1) సర్పంచుల నిధులు ,విధులు, అధికారాల సాధన కోసం మరియు కేంద్ర ప్రభుత్వం 14 ,15వ ఆర్థిక సంఘం ద్వారా 12918 గ్రామాల సర్పంచులకు పంపిన రూ,,8660 కోట్ల రూపాయలు తిరిగి సర్పంచుల PFMS ఖాతాల్లో జమ చెయ్యాలని…

2) గ్రామ సచివాలయాలను సర్పంచుల అధ్వర్యంలోకి తీసుకురావాలని….

3) సర్పంచులకు , ఎంపీటీసీ లకు రూ:15 వేలు – అలాగే ఎంపీపీ లకు, జడ్పిటిసి లకు రూ,,30000 వేలు గౌరవ వేతనం ఇవ్వాలని….

4) ఉపాధి హామీ నిధులు కూడా గతంలో మాదిరే సర్పంచులకు ఇవ్వాలని….

5) పాత పద్ధతిలోనే పంచాయతీలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని..

6) గత మూడు న్నర సంవత్సరములుగా రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసిన గ్రామపంచాయతీల బకాయి నిధులను వెంటనే విడుదల చేయాలని…

ఇలా న్యాయబద్ధమైన సర్పంచ్ ల 12 డిమాండ్ల సాధన కోసం మా పార్టీల మద్దతు తెలియ జేస్తూ ఆంధ్రప్రదేశ్ సర్పంచ్ ల సంఘానికి అండగా ఉంటామని తెలియజేశారు.

ఈ సందర్బంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పంపిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్ళించడం పై సర్పంచుల సంఘం నాయకులు ఢిల్లీకి రండి స్వయంగా కేంద్రానికి ఫిర్యాదు చేద్దామని, రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో సర్పంచుల సంఘం చేపట్టే అన్ని ఉద్యమాలకు మా బిజెపి పార్టీ గల్లీ నుంచి ఢిల్లీ వరకు మద్దతుగా నిలుస్తామని వీర్రాజు అన్నారు.

తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ ఛాంబర్ రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేసి స్థానిక సంస్థల ప్రతినిధులకు ఎన్నో జీవోలు సాధించి పెట్టిన ఘనత ఈ ఛాంబర్ ది అని, తప్పకుండా ఇప్పుడు చేస్తున్న పోరాటాలు కూడా భవిష్యత్తు తరాలకి మంచి స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు.

జనసేన పార్టీ నాయకులు బండ్రెడ్డి రాము మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా ప్రజాక్షేత్రంలో గెలిచిన సర్పంచుల హక్కులు కాల రాస్తున్నటువంటి ఈ ప్రభుత్వంపై సర్పంచుల సంఘం చేస్తున్న పోరాటాలకు మా పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు.

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ కేంద్రం పంపిన నిధులను దారి మళ్లించి తన సొంత అవసరాలకు వాడుకొని సర్పంచులకు నిధులు విధులు అధికారాలు లేకుండా చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వంపై పోరాడుతున్న సర్పంచులు సంఘానికి మా పూర్తి మద్దతు తెలియజేస్తున్నామని అన్నారు.

జై భీమ్ పార్టీ నాయకులు జడ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ సర్పంచులు తమ న్యాయబద్ధమైన హక్కుల కోసం పోరాడుతున్నారని అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం తుంగలో తొక్కుతోందని సర్పంచులకు మా పార్టీ తరఫున ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలియజేశారు.

కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా సర్పంచులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాంగ్రెస్ పార్టీ తరఫున వారి ఉద్యమాలకు మద్దతు తెలియజేస్తున్నామని అన్నారు.

అదేవిధంగా ఈ అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసి తమ పార్టీల తరఫున మద్దతు తెలియజేసిన ప్రతి పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు వైవిబి రాజేంద్రప్రసాద్ సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు వానపల్లి లక్ష్మీ ముత్యాలరావు అన్నారు.

ఈ అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి రాష్ట్ర సర్పంచుల సంఘం నాయకులు, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ నాయకులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS