తెలంగాణలో ఈ నెల 15న సెలవును ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 15న ఐచ్ఛిక సెలవు దినంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 15న బంజారాల ఆరాధ్యుడు సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి. కాబట్టి ఆరోజున సెలవు ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటి రెడ్డి వెంకటరరెడ్డి మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వచ్చే ఏడాది సంత్ సేవాలాల్ జయంతి నాటికి తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఇక, రాష్ట్రంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ముఖ్యంగా గిరిజనుల అభివృద్ధి కోసం రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక చర్యలు కూడా తీసుకుంటుందని ఆయన అన్నారు. హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌పై సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మాజీ ఎమ్మెల్సీ రాముల్ నాయక్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి స్పందించడం జరిగింది.
అనంతపురం జిల్లా గుత్తి సమీపంలోని గొల్లలదొడ్డి దగ్గరున్న సేవాగఢ్‌లో బంజారాల ఆరాధ్యుడు సంత్ సేవాలాల్ మహారాజ్ జన్మించారని తెలుస్తోంది. సంత్ సేవాలాల్1739 ఫిబ్రవరి 15న పుట్టారు. ఆయన గొప్ప సంఘ సంస్కరణవాది. ఆధ్యాత్మిక గురువు. సంత్ సేవాలాల్ జగదంబకు భక్తుడు. సంత్ సేవాలాల్ మహారాజ్ ఓ బ్రహ్మచారి. ఆయన విశిష్ట బోధనలతో యశస్సును పొందారు.
సంత్ లాల్ బంజారాల హక్కులు, నిజామ్, మైసూరు పాలకుల దాష్టీకాలకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేశారు. ముఖ్యంగా 18వ శతాబ్దంలో సాగిన పోరాటంలో సంత్ సేవాలాల్ ముఖ్యపాత్ర పోషించారు. అంతేకాకుండా బ్రిటిషులు, ముస్లిం పాలకుల ప్రభావాలకు గురికాకుండా, బంజారాలు ఇతర ఆచారాలను, సంప్రదాయాల్లోకి మారకుండా సంత్ సేవాలాల్ ఎంతగానో కృషిచేశారు. బంజారాల ఆచారాలు, కట్టుబాట్లు, విభిన్నమైన దుస్తులతో తమ ప్రత్యేకతను నిలుపుకుంటున్నారంటే అది సంత్ సేవాలాల్ చేసిన కృషే. అందుకే, బంజారాలు ఆయన్ను దైవంతో భావించి ప్రతిఏటా ఆయన జయంతిని ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సెలవుదినంగా ప్రకటించింది.