ఇండియన్‌ బ్యాంకు నుంచి విరివిగా రుణాలు

Spread the love

ఇండియన్‌ బ్యాంకు నుంచి విరివిగా రుణాలు ఇప్పించగలరు – ఎంపీ వల్లభనేని బాలశౌరి

చెన్నైలో ఇండియన్‌ బ్యాంకు ఎండీ మరియు సీఈవో శాంతి లాల్‌ జైన్‌ను కలిసిన ఎంపీ బాలశౌరి

మచిలీపట్నం పార్లమెంట్‌ పరిధిలో పేద వర్గాలకు రుణాలు అందజేయాలని కోరిన ఎంపీ బాలశౌరి

ఎంపీ బాలశౌరి విన్నపంపై సానుకూలంగా స్పందించిన ఇండియన్‌ బ్యాంకు సీఈవో జైన్‌

త్వరలో మచిలీపట్నం పార్లమెంట్‌ పరిధిలో భారీ రుణమేళా ఏర్పాటు చేసి బడుగు, బలహీన వర్గాలకు రుణాల పంపిణీకి ఎంపీ బాలశౌరి చొరవ..

మచిలీపట్నం పార్లమెంట్‌ పరిధిలోని మత్స్యకార, గౌడ, రజక, యాదవ, ముదిరాజు, ఇతర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇండియన్‌ బ్యాంకు ద్వారా రుణాలు విరివిగా అందజేయాలని ఆ బ్యాంకు ఎండీ, సీఈవో శాంతి లాల్‌ జైన్‌ను మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి కోరారు. ఈ సందర్బంగా చెన్నైలో ఇండియన్‌ బ్యాంకు ఎండీ, సీఈవో శాంతి లాల్‌ జైన్‌ను ఎంపీ బాలశౌరి సోమవారం కలిశారు. మచిలీపట్నం పార్లమెంట్‌ పరిధిలో పేద వర్గాలు, బడుగు బలహీన వర్గాలు అధికంగా ఉన్నారని, వారందరికీ ఇండియన్‌ బ్యాంకు ద్వారా రుణాలు అందజేస్తే వారికి ఉపాధి మార్గం ఏర్పడుతుందని, ఆర్థికంగా ఎదుగుతారని ఎంపీ బాలశౌరి వివరించారు.

ఈ అంశంపై ఇండియన్‌ బ్యాంకు ఎండీ, సీఈవో శాంతి లాల్‌ జైన్‌ సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ బాలశౌరి తెలిపారు. త్వరలో మచిలీపట్నం పార్లమెంట్‌ పరిధిలో అతిపెద్ద రుణమేళా నిర్వహించనున్నట్లు ఎంపీ వివరించారు. ఇప్పటికే మచిలీపట్నం పరిధిలో అనేకసార్లు రుణమేళాలు నిర్వహించి పేదలకు రుణాలు పంపిణీ చేయడం జరిగిందని ఎంపీ బాలశౌరి పేర్కొన్నారు. పేదవర్గాలకు రుణాలు అందించి వారి కాళ్లపై వారు నిలబడేలా చేయడమే తన లక్ష్యమని ఎంపీ బాలశౌరి వివరించారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని అభివృద్దిలోకి రావాలన్నది తన ఆకాంక్ష అని ఎంపీ స్పష్టం చేశారు.

Related Posts

You cannot copy content of this page