ఓటర్ దరఖాస్తుల డిజిటలైజేషన్ను వెంటనే పూర్తి చేయాలి

Spread the love

Digitization of voter applications should be completed immediately

ఓటర్ దరఖాస్తుల డిజిటలైజేషన్ను వెంటనే పూర్తి చేయాలి

ప్రతి జిల్లాలో జనాభా ఓటర్ల నిష్పత్తి, జెండర్ నిష్పత్తిపై ప్రత్యేక దృష్టి,

దివ్యాంగ ఓటర్లను పోలింగ్ కేంద్రాల వారిగా మ్యాప్ చేయాలి,

వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్

మేడ్చల్ జిల్లా సాక్షిత ప్రతినిధి;-
రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ దరఖాస్తుల డిజిటలైజేషన్ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలని ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి రవికిరణ్తో కలిసి జిల్లా కలెక్టర్లతో ఓటర్ నమోదు, సవరణలకు సంబంధించి ఫారం– 6, 7, 8 ఆన్లైన్ డేటా ఎంట్రీ, ఓటరు జాబితా రూపకల్పనపై వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు.
ఈ సందర్భంగా మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా సమీకృత కలెక్టరేట్ వీడియో సమావేశ మందిరం నుంచి జిల్లా కలెక్టర్ హరీశ్, జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, అభిషేక్ అగస్త్య ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో వచ్చిన దరఖాస్తులను డిజిటలైజేషన్ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.

ఉపాధి కోసం కొందరు పట్టణాలలో నివాసం ఉంటున్నప్పటికీ గ్రామాల్లో వారికి ఓటు హక్కు ఉంటుందని, రెండు ప్రాంతాల్లో ఓటరుగా నమోదు చేసుకున్న వివరాలు పరిశీలించి, అధికారులతో క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి ఈఆర్వోలు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో వచ్చే సంవత్సరం సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయని అధిక సంఖ్యలో ఓటరు నమోదు ప్రక్రియ జరిగే అవకాశం ఉందని, ప్రస్తుతం పకడ్బందీగా ఓటరు జాబితా సిద్ధం చేస్తే ఎన్నికల సమయంలో ప్రక్రియ సజావుగా జరుగుతుందని ఆయన తెలిపారు.

జిల్లాలో ఉన్న జనాభాకు ఓటర్ల నిష్పత్తి, ఓటర్లలో జెండర్ నిష్పత్తి ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు ఉండే విధంగా చూడాలని వికాస్ రాజ్ తెలిపారు. ఓటరు నమోదు సమయంలో ట్రాన్స్జెండర్లు, సెక్స్ వర్కర్లు వివిధ ప్రత్యేక వర్గాలతో సమావేశాలు నిర్వహించామని, వారందరి పేర్లు ఓటరు జాబితాలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలో 18 సంవత్సరాల నిండిన దివ్యాంగులందరికి ఓటు హక్కు కల్పించి, పోలింగ్ కేంద్రాల వారిగా మ్యాపింగ్ చేయాలని తెలిపారు. ఓటరు జాబితా పకడ్బందీగా రూపొందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లను ఆదేశించారు.

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సూచనలు విధిగా పాటించేలా చర్యలు
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సూచనలను అధికారులందరూ విధిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు ఓటరు జాబితాలో సవరణలు జిల్లాలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించాలన్నారు.

జాబితాలో పుట్టిన తేదీ, పేరు మార్పు, చేర్పులు, ఫొటో క్లారిటీ, జిల్లాలో ట్రాన్స్ జెండర్ ఓటర్ నమోదు తప్పకుండా చేయాలని సూచించారు. ఈ విషయంలో ఈఆర్వోలు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని బూత్ లెవల్ ఆఫీసర్లతో సమీక్ష సమావేశాలు నిర్వహించాలని కలెక్టర్ హరీశ్ పేర్కొన్నారు. జిల్లాలో ఓటర్ల సంఖ్య పెంచేందుకు చేపట్టాల్సిన చర్యలను వివరించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, అభిషేక్ అగస్త్య, జిల్లాఆ రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, కలెక్టరేట్ ఏవో వెంకటేశ్వర్లు, ఈఆర్వోలు తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page