తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే చేప ప్రసాదం పంపిణీ కి ప్రభుత్వం

Spread the love

సాక్షిత : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే చేప ప్రసాదం పంపిణీ కి ప్రభుత్వం పూర్తిస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఈ నెల 9 వ తేదీన మృగశిర కార్తె సందర్బంగా నిర్వహించే చేప ప్రసాదం పంపిణీ కి వివిధ శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న ఏర్పాట్లను మంత్రి సమీక్షించారు. చేప ప్రసాదం కోసం మూడు రోజుల ముందే ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు చేరుకున్న హర్యానా, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన వారితో మంత్రి మాట్లాడారు. అనంతరం మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుండి చేప ప్రసాదం పంపిణీ జరుగుతుందని, అయినప్పటికీ ఉమ్మడి రాష్ట్రంలో అరకొర ఏర్పాట్లు చేసేదని, దాంతో చేప ప్రసాదం కోసం వచ్చే ప్రజలు అనేక ఇబ్బందులు పడేవారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వం కోట్ల రూపాయల వ్యయంతో అన్ని ఏర్పాట్లు చేస్తుందని అన్నారు.

చేప ప్రసాదం కోసం గతంలో కంటే అధికంగా కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. బత్తిన హరినాద్ గౌడ్ కుటుంబ సభ్యులు 250 మంది చేప ప్రసాదం పంపిణీ చేస్తారని చెప్పారని, వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులను అందజేయనున్నట్లు చెప్పారు. అవసరమైన చేప పిల్లలను మత్స్య శాఖ ఆధ్వర్యంలో సరఫరా చేయనున్నట్లు తెలిపారు. చేప ప్రసాదం కోసం వచ్చే రద్దీని దృష్టిలో ఉంచుకొని పటిష్టమైన భారికేడ్ లను ఏర్పాటు చేయడంతో పాటు విద్యుత్ సరఫరా లో ఎలాంటి అంతరాయం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు.వాటర్ వర్క్స్ ఆధ్వర్యంలో సరిపడా త్రాగునీటిని అందుబాటులో ఉంచుతామని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేకంగా GHMC పారిశుధ్య సిబ్బందిని నియమించడం జరుగుతుందని పేర్కొన్నారు.

ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ట్రాపిక్ మళ్ళించడం జరుగుతుందని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ ల ఏర్పాటు తో పాటు అంబులెన్స్ లను కూడా అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు. RTC ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేస్తుందని అన్నారు. చేప ప్రసాదం కోసం వచ్చే ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ప్రభుత్వం అన్ని పకడ్బందీ ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు. ఇక్కడకు వచ్చే వారికి బద్రి విశాల్ పిట్టి, శ్రీకృష్ణ సమితి, అగర్ వాల్ సమాజ్ వంటి పలు స్వచ్చంద సంస్థలు అల్పాహారం, భోజనం ఉచితంగా అందిస్తాయని వివరించారు. మంత్రి వెంట MLC M.S.ప్రభాకర్ రావు, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా, కార్పొరేటర్ లు శంకర్ యాదవ్, నందు బిలాల్, ప్రేమ్ సింగ్ రాథోడ్, RDO వెంకటేశ్వర్లు, జోనల్ కమిషనర్ రవి కిరణ్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకట్, వాటర్ వర్క్స్ డైరెక్టర్ కృష్ణ, DCP అశోక్ కుమార్, వెస్ట్ జోన్ ACP కోటేశ్వరరావు, ట్రాపిక్ ఇన్ స్పెక్టర్ గురునాద్, ఆర్ అండ్ బి SE లింగారెడ్డి, EE శ్రీనివాస్, ట్రాన్స్ కో డైరెక్టర్ శ్రీనివాస్, CGM నర్సింహ స్వామి, SE బ్రహ్మం తదితరులు ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page