Adani case should be thoroughly investigated by JPC or CJI
అదానీ వ్యవహారంపై జేపీసీ లేదా సీజేఐతో సమగ్ర విచారణ జరిపించాలి
పార్లమెంట్ లో చర్చించాల్సిందే
కేంద్రం ఎందుకు వెనక్కిపోతుంది?
బీఆర్ఎస్ పార్లమెంట్, లోక్ సభ పక్ష నాయకులు కేశవరావు, నామ నాగేశ్వరరావు డిమాండ్
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
అదానీ వ్యవహారంపైన, హిండెన్ బర్గ్ నివేదికపైనా తక్షణమే పార్లమెంట్ లో చర్చ జరిపి, జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ ) లేదా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సమగ్ర విచారణ జరిపించాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ ( రాజ్యసభ ) నాయకుడు కే.కేశవరావు, లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు,పార్టీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
న్యూఢిల్లీలో వారు విలేకరులతో మాట్లాడారు. ఈ ఆర్ధిక అంశంపై పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చ జరపాలని వాయిదా తీర్మానం నోటీస్ ఇస్తే సభ ఆర్డర్లో లేదనే కారణంతో సభను వాయిదా వేసి, వెనక్కిపోవడం బాధాకరమని పేర్కొన్నారు. యావత్ ప్రతిపక్ష సభ్యులంతా ఈ అంశంపై చర్చ జరపాలని పట్టుబడుతున్నా కేంద్రం కావాలనే పార్లమెంట్లో చర్చ జరపకుండా వెనక్కిపోతుందని అన్నారు. ఎప్పుడైనా ఏ సమస్యపైనా అయినా పార్లమెంట్లో చర్చించొచ్చు అన్న కేంద్రం ఎంతో ముఖ్యమైన ఈ సమస్యపై ఎందుకు చర్చ జరపకుండా తప్పించు కుంటుందని ప్రశ్నించారు.
ఈ అంశంపై ప్రతిపక్ష సభ్యులు చర్చకు పట్టుబడుతున్నా ఎందుకు కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని నామ ధ్వజమెత్తారు. పార్లమెంట్ బడ్జెట్ సెషన్లోనే ఈ అంశంపై చర్చించాలని నోటీస్ ఇచ్చామని, కానీ స్పీకర్ పట్టించుకోకుండా సభను వాయిదా వేయడం ఏమిటనీ ప్రశ్నించారు. ఎల్ఐసీ, ఇతర బ్యాంకుల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు తో పాటు ప్రజలు, పేదలు జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న డబ్బును పిల్లల పెళ్ళిళ్లకు, విద్య, ఇతర అవసరాల కోసం దాచుకున్నారని, ఇవాళ వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని అన్నారు.
అందుకే ఈ ఆర్ధిక అంశంపై చర్చించాలని కోరుతున్నా కేంద్రం ముందుకు రావడం లేదన్నారు. ఈ అంశం దేశ ప్రజలతో ముడిపడి ఉ న్నందున సత్వరమే పార్లమెంట్లో చర్చించాల్సిన అవసరం ఉందని కేశవరావు, నామ స్పష్టంచేశారు. ఈ సమస్యకు సంబంధించి లోతుగా దాగి ఉన్న అంశాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ అంశంపై విదేశాల్లో సైతం చర్చ జరుపుతుంటే భారత్ ప్రభుత్వం ఎందుకు చర్చకు వెనకడుగు వేస్తుందో అర్ధంకావడం లేదని పేర్కొన్నారు. పేద ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్న అంశం కనుక వెంటనే పార్లమెంట్లో చర్చించాలని పట్టుబట్టామని చెప్పారు. కానీ కేంద్రం ఇవేవి పట్టించుకోకుండా తప్పించుకుంటుందని అన్నారు.
అదానీ స్టాక్స్ వివాదం కావడంతో ఎల్ఐసి , బ్యాంకింగ్ రంగంలో పెట్టుబడులు పెట్టిన వారు, డబ్బు దాచుకున్న పేద ప్రజల్లో అభద్రతా భావం నెలకొని, ఆందోళన చెందుతున్నందున పార్లమెంట్లో ఈ అంశంపై పూర్తి స్థాయిలో చర్చ జరపాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ప్రశ్నోత్తరాలను పక్కకు పెట్టి, అదానీ అంశంపై ముఖ్యాంశంగా చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నా కేంద్రానికి పట్టడడం లేదని కేశవరావు, నామ పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ ఎంపిలు కూడా పాల్గొన్నారు.