-జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత
పట్టభద్రుల ఎమ్మెల్సీ కి పట్టభధ్రులందరు ఈ నెల 6 లోగా ఓటర్లుగా నమోదు చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. శుక్రవారం నూతన కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఎమ్మెల్సీ, పార్లమెంట్ ఎన్నికల సన్నద్దత పై కలెక్టర్ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటరు జాబితా సవరణ ఉంటుందని, ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటరు జాబితా మొదటి నుండి రూపకల్పన చేయాల్సి ఉంటుందని అన్నారు. ఫారం-18 ద్వారా ఆన్లైన్, ఆఫ్ లైన్ ద్వారా నమోదు చేసుకోవచ్చన్నారు. ఈ నెల 24న డ్రాఫ్ట్ రోల్స్ ప్రదర్శించి, మార్చి 14 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామని, మార్చి 29న అభ్యంతరాలు పరిష్కరించి, ఏప్రిల్ 4 న ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల తుది ఎలక్టోరోల్ పబ్లికేషన్ చేయనున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో 2021 ఎన్నికల్లో 87177 మంది పట్టభద్రులు నమోదుచేసుకోగా, ప్రస్తుతం ఇప్పటివరకు 53463 మంది దరఖాస్తు చేసినట్లు ఆయన అన్నారు. 107 పోలింగ్ కేంద్రాలను జిల్లా వ్యాప్తంగా ఏర్పాటుచేయనున్నట్లు ఆయన అన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ఎస్ఎస్ఆర్-2024 చేపట్టినట్లు, జనవరి 6న డ్రాఫ్ట్ పబ్లికేషన్ విడుదల చేసినట్లు తెలిపారు. డ్రాఫ్ట్ పబ్లికేషన్ ప్రకారం జిల్లాలో 1216832 మంది ఓటర్లు ఉండగా, దీనిలో 23124 చేర్పులు, 20435 తొలగింపులు చేసినట్లు ఆయన తెలిపారు. తొలగించిన ప్రతి ఓటరుకు సంబంధించి, సంబంధికులకు నోటీసు ఇచ్చి, ఫారం-7ద్వారా దరఖాస్తు స్వీకరించి, నిబంధనలు పాటిస్తూ, ప్రక్రియ పూర్తి చేసినట్లు ఆయన అన్నారు. శుక్రవారం నాటికి జిల్లాలో 1219521 మంది ఓటర్లుగా ఉన్నట్లు, ఇందులో 588362 మంది పురుషులు, 631072 మంది మహిళలు, 87 మంది ట్రాన్సజెండర్లు ఉన్నారన్నారు. 18-19 సంవత్సరాల నూతన ఓటర్లు 37740 మంది ఉన్నట్లు, ఎలక్టోరోల్ పై అభ్యంతరాలు ఉంటే ఫారం-7 ద్వారా దరఖాస్తు చేయవచ్చన్నారు. జిల్లాలో 1455 పోలింగ్ కేంద్రాలు, ఒక అక్జిలరి పోలింగ్ కేంద్రం ఉన్నట్లు ఆయన తెలిపారు. క్రొత్తగా నమోదు చేసుకున్న ఓటర్లకు ఈ నెల 15 నుండి ఎపిక్ కార్డులు అందుతాయన్నారు. ఎన్నికల నిర్వహణ ఎన్నికల కమీషన్ షెడ్యూల్ మేరకు సజావుగా జరిగేలా అన్ని చర్యలు చేపట్టనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, జిల్లా పౌరసంబంధాల అధికారి ఎం.ఏ. గౌస్, ఎన్నికల విభాగ సూపరింటెండెంట్ రాంబాబు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.