దళిత బంధు ఎవరికిచ్చారో చిట్టా మా దగ్గర ఉంది : బీఎస్పీ క్రాంతి కుమార్
వికారాబాద్ నియోజక వర్గంలో బి ఆర్ ఎస్ పార్టీ రెండుగా విడిపోయి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటు ప్రజా సమస్యలు గాలికి వదిలేశారనీ బీఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షుడు క్రాంతి కుమార్ అన్నారు.సోమవారం జిల్లా కేంద్రంలోని బీఎస్పీ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ… ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ దళిత బంధు పథకాన్ని ఎవరికి అమలు చేశారు అనేది తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయన్నారు. ఈ విషయంలో ఒక్కసారి ఎమ్మెల్యే ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. ఇక పాలన విషయానికొస్తే గ్రామాలను గాలికి వదిలేయడమే కనీసం పట్టణాన్ని కూడా ఏ విధంగా అభివృద్ధి చేయలేదన్నారు.
అందుకు ప్రత్యేక నిదర్శనంగా పట్టణంలోని బీజేఆర్ చౌరస్తా ను చూస్తే స్పష్టం అవుతుందన్నారు. ఒకటి కాదు రెండు కాదు వికారాబాద్ నియోజకవర్గంలో ప్రజా సమస్యలు కుప్పలు తెప్పలుగా పడి ఉంటే ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను మరిచి స్వార్థ రాజకీయాలు చేయడం ఎంతవరకు సబబు అన్నారు. ఇతరులపై నిందలు వేయడం మాని మిగిలి ఉన్న ఆరు నెలల సమయంలో ప్రజలకు ఏదైనా మంచి చేసేందుకు ప్రయత్నించండనీ ఎద్దేవా చేశారు. ఇకపోతే ఆనంద్ కు వచ్చే ఎన్నికల్లో బీఎస్పీ పార్టీ టికెట్ వస్తుందని జరిగే ప్రచారంలో వాస్తవం లేదని, బీఎస్పీ పార్టీలో కుటుంబ పాలనకు తావు లేదన్నారు. బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఆనంద్ పాలనతో ప్రజలు విసిగిపోయి ఉన్నారని వచ్చే ఎన్నికల్లో బీఎస్పీ పార్టీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.