భారత రాష్ట్రపతి కార్యక్రమానికి పటిష్ట ప్రణాళిక చేపట్టండి

Spread the love

Undertake a solid plan for the program of the President of India

ఈ నెల 26వ తేదీ భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము శ్రీశైల పర్యటనను విజయవంతం చేయండి

భారత రాష్ట్రపతి కార్యక్రమానికి పటిష్ట ప్రణాళిక చేపట్టండి

జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్

శ్రీశైలం/నంద్యాల,

ఈ నెల 26వ తేదీ భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము
పర్యటన కార్యక్రమాన్ని అధికారులందరూ సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని
జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ ఆదేశించారు. శ్రీశైలం దేవస్థానంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము పర్యటన కార్యక్రమ ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ టి. నిశాంతిలతో కలిసి సమీక్ష నిర్వహించారు. శ్రీశైల దేవస్థాన ట్రస్ట్ బోర్డు చైర్మన్ రెడ్డి వారి చక్రపాణిరెడ్డి, డిఆర్ఓ పుల్లయ్య, దేవస్థాన ఈఓ లవన్న, సంబంధిత జిల్లాధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ మాట్లాడుతూ భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఈ నెల 26వ తేదీ శ్రీశైల మహా పుణ్యక్షేత్ర పర్యటనను విజయవంతం చేసేందుకు అధికారులు అందరూ సమన్వయంతో కృషి చేయాలన్నారు. రాష్ట్రపతి కార్యక్రమానికి సంబంధించి సంబంధిత అధికారులందరికీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని… ఆ మేరకు అన్ని ఏర్పాట్లు పక్కాగా చేసేందుకు సిద్ధం కావాలన్నారు.

సున్నిపెంట హెలిప్యాడ్‌ లో ఒకే సారి మూడు హెలికాప్టర్లు ల్యాండ్ అయ్యేలా అన్ని ఏర్పాట్లు ఈనెల 23వ తేదీ ఉదయంలోగా పూర్తి చేసి ఇవ్వాలని ఆర్అండ్బి ఎస్ఈ శ్రీధర్ రెడ్డిని ఆదేశించారు. ఈ నెల 24వ తేదీ ట్రయల్ రన్ ఉంటుందని అప్పటిలోగా అధికారులకు అప్పగించిన పనులు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. హెలిప్యాడ్‌ సమీపంలో మూడు అగ్నిమాపక వాహనాలను ఏర్పాటు చేసుకోవాలని జిల్లా అగ్నిమాపక అధికారిని ఆదేశించారు.

కాన్వాయ్ వెంట న్యూరో సర్జన్, కార్డియాలజిస్ట్, ఇతర ప్రముఖ నిపుణులు ఫాలో కావడంతో పాటు రాష్ట్రపతి పాల్గొనే మూడు ప్రదేశాలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని డిఎంహెచ్ఓ, జిల్లా ఆసుపత్రి వైద్య అధికారులను ఆదేశించారు. హెలిప్యాడ్‌ నుండి శ్రీశైలం ప్రధానాలయం కొరకు పారిశుధ్య చర్యలు ముమ్మరంగా చేపట్టడంతో పాటు సుందరీకరణ పనులు చేపట్టాలన్నారు.

అలాగే అలాగే మూడు ప్రదేశాల్లో తాత్కాలిక టాయిలెట్లు ఏర్పాటు చేయడంతో పాటు విద్యుత్ అంతరాయం లేకుండా అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అలాగే నిర్దేశించిన ఐదు ప్రదేశాల్లో జనరేటర్లు ఏర్పాటు చేసుకోవాలని ఏపీఎస్పీడీసీఎల్ అధికారులను సూచించారు. రహదారిలో గుంతలు లేకుండా చూడటంతో పాటు సైడ్ లో వైట్ పెయింటింగ్ తో మార్కింగ్ ఇవ్వాలని ఆర్ అండ్ బి, ఎన్ హెచ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

శ్రీశైల ప్రధాన గోపురమైన శ్రీకృష్ణదేవరాయ గోపురం వద్ద ఆలయ సాంప్రదాయాలతో భారత రాష్ట్రపతికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి… భ్రమరాంబ శ్రీ మల్లికార్జున స్వామి వారి ప్రత్యేక దర్శనానికి ఏర్పాట్లు చేయాలని దేవస్థాన కార్యనిర్వహణాధికారిని కలెక్టర్ ఆదేశించారు.

అనంతరం నంది సర్కిల్ లోని టూరిజం ఫెసిలిటేషన్ సెంటర్ లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రసాద్ స్కీం క్రింద రు.43.08 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టు పనుల ప్రారంభానికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని టూరిజం డైరెక్టర్ ఈశ్వరయ్యను కలెక్టర్ ఆదేశించారు. భద్రతా ఏర్పాట్లు, సేఫ్‌ రూమ్‌ సౌకర్యం, తదితర అన్ని రకాల ఏర్పాట్లలో ప్రొటోకాల్‌ ప్రకారం సక్రమంగా చేయాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. తదుపరి భారత రాష్ట్రపతి సందర్శించే శివాజీ స్ఫూర్తి కేంద్రంలో కూడా ఏర్పాట్లు పరిశీలించేందుకు అధికారులను నియమించాలని డిఆర్ఓ ను కలెక్టర్ ఆదేశించారు.

జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ భారత రాష్ట్రపతి పర్యటనకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు శ్రీనివాసులు, వెంకటరెడ్డి, ఎం దాసు సంబందిత జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page