ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత
ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. వైరా అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని గన్నవరం – నెమలి – దాచేపూరం టి జంక్షన్ వద్ద గల అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ లను మంగళవారం పోలీస్ కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విధుల్లో ఉన్న సిబ్బంది, కేంద్ర బలగాలకు పలు సూచనలు చేశారు. వాహన తనిఖీల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు.పోలీస్ వాహనాలతో సహా అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన వాహనాలను సైతం తనిఖీ చేయాలన్నారు. తనిఖీలో అక్రమ మద్యం, నగదు, మాదకద్రవ్యాలు వంటి అక్రమ తరలింపులను గుర్తించినట్లయితే వాటిని సీజ్ చేసే సమయంలో వీడియోగ్రఫీ చేయించాలన్నారు. అయితే తనిఖీల వల్ల సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకొవాలన్నారు. ప్రజలు ఎవరైనా నగదును వెంటబెట్టుకొని ప్రయాణాలు చేయాల్సి వస్తే సరైన ఆధారాలు కలిగి ఉండాలని సూచించారు. ఆధారాలు లేనట్లయితే నగదు జప్తు చేస్తారని అన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి తూచా తప్పకుండా అమలయ్యేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకొవాలని అన్నారు. లోకసభ ఎన్నికల నిర్వహణలో భాగంగా నగదు, మద్యం, విలువైన వస్తువులు, డ్రగ్స్ లాంటి అక్రమ రవాణాను నిరోధించడంలో భాగంగా పోలీస్, రెవెన్యూ, ఫారెస్ట్, రవాణా, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ తదితర శాఖలతో అంతరాష్ట్ర, అంతర్ జిల్లా సరిహద్దుల వెంట ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి రౌండ్ ది క్లాక్ పటిష్టంగా తనిఖీలు చేయడం జరుగుతుందన్నారు. ఎన్నికల పక్రియ ముగిసేంతవరకు చెక్ పోస్టులలో నిరంతరం 24 గంటల పాటు తనిఖీలు నిర్వహించాలని అన్నారు.