ఉత్తరాఖండ్‌ సీఎంను కలిసిన స్వాత్మానందేంద్ర

Spread the love

విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి ఉత్తరాఖండ్‌ రాజధాని డెహ్రాడూన్‌లో పర్యటించారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ దామితో భేటీ అయ్యారు. వచ్చే నెల 3వ తేదీన రిషికేష్‌లో ప్రారంభించనున్న చాతుర్మాస్య దీక్షపై చర్చించారు. దీక్షా కాలంలో విశాఖ శ్రీ శారదాపీఠం రిషికేష్‌ ఆశ్రమాన్ని సందర్శించాల్సిందిగా కోరుతూ ఆహ్వానపత్రికను అందజేసారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామివారు 2009 సంవత్సరం నుండి రిషికేష్‌ వేదికగానే చాతుర్మాస్య దీక్షను చేపడుతున్నారని వివరించారు. పీఠం భక్తులు అనేక మంది తమ ప్రాంతంలో దీక్ష చేపట్టాలని కోరినా దేవభూమిగా భావించి రిషికేష్‌లోనే ఏటా చాతుర్మాస్య దీక్షను నిర్వహిస్తున్నారని తెలిపారు. రుషులు, మహాత్ములు సంచరించే హిమాలయ పాద ప్రాంతమంటే తమ గురువులకు ఎంతో మక్కువ అని పేర్కొన్నారు. స్వరూపానందేంద్ర స్వామి 14 సంవత్సరాల పాటు రిషికేష్‌లోనే శాస్త్రాధ్యయనం చేసారని తెలిపారు. దక్షిణాది ఆచారాలను ఉత్తరాదికి, ఉత్తరాది ఆచారాలను దక్షిణాదికి పరిచయం చేయడానికి చాతుర్మాస్య దీక్షాకాలం ఎంతో ఉపయోగపడుతోందని అన్నారు. ఈ సందర్భంగా ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ సింగ్‌ దామి మాట్లాడుతూ చార్‌ధామ్‌ యాత్రీకుల సౌకర్యార్ధం కమ్యూనికేషన్‌ వ్యవస్థను మెరుగుపరుస్తున్నామని, రహదారులను విస్తరిస్తున్నామని తెలిపారు. లోక కళ్యాణార్ధం రిషికేష్‌ వేదికగా చాతుర్మాస్య దీక్ష చేపడుతుండటం పట్ల సీఎం పుష్కర్‌ సింగ్‌ దామి సంతోషం వ్యక్తం చేసారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం తరపున దీక్షకు ఎటువంటి సహకారమైనా అందిస్తామని స్వాత్మానందేంద్ర స్వామికి హామీనిచ్చారు

Related Posts

You cannot copy content of this page