యాదాద్రీశుడికి కాసుల వర్షం.. మరోసారి రికార్డు స్థాయి ఆదాయం

Spread the love

Rain of money for Yadadrishu.. Record income once again

యాదాద్రీశుడికి కాసుల వర్షం.. మరోసారి రికార్డు స్థాయి ఆదాయం

యాదాద్రి: కార్తీకమాసం చివరి వారం కావడంతో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం సెలవుదినం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

శివాలయం, కార్తీక దీపారాధన, వ్రత మండపాలతో పాటు కొండపై ఎక్కడ చూసినా భక్తుల సందడే కనిపించింది. కల్యాణకట్ట, పార్కింగ్‌ ఏరియా, బస్‌ బే, దర్శన, ప్రసాద క్యూలైన్లు రద్దీగా మారాయి.

దీంతో స్వామి వారి దర్శనానికి 4గంటలు, ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది. భక్తులు కార్తీక దీపాలు వెలిగించుకోవడానికి కొండపైన ప్రధాన ఆలయ ప్రాంగణం, శివాలయం, విష్ణు పుష్కరిణి, కొండ కింద వ్రత మండపం, లక్ష్మీ పుష్కరిణి వద్ద దీపారాధన స్టాళ్లు ఏర్పాటు చేశారు. భక్తులు కుటుంబ సమేతంగా కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు.

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామికి ఆదివారం వివిధ కైంకర్యాల ద్వారా రూ.1,16,13,977ల ఆదాయం లభించిందని ఆలయ ఈవో తెలిపారు. ప్రధాన బుకింగ్‌ ద్వారా రూ.3,24,650, కైంకర్యాలు రూ.16,100, సుప్రభాతం రూ.10,300, వ్రతాలు రూ.15,20,000, ప్రచారశాఖ రూ.2,87,500, వీఐపీ దర్శనం రూ.18,90,000, యాదరుషి నిలయం రూ.1,92,500, ప్రసాద విక్రయం ద్వారా రూ.44,37,150,

పాతగుట్ట రూ.3,78,670, కళ్యాణ కట్ట రూ.1,78,000, శాశ్వత పూజలు రూ.37,500, వాహన పూజలు రూ.31,200, కొండపైకి వాహన ప్రవేశం ద్వారా రూ.9,75,000, సువర్ణ పుష్పార్చన రూ.2,52,348, వేద ఆశీర్వచనం రూ.19,800, శివాలయం రూ.32,600, అన్నదానము రూ.55,659, బ్రేక్‌దర్శనం టికెట్ల విక్రయం ద్వారా రూ.9,75,000లు ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు వెల్లడించారు.

హైదరాబాద్‌ – వరంగల్‌ జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ జామ్‌

కార్తికమాసం చివరి ఆదివారం కావడంతో యాదాద్రికి భక్తులు పోటెత్తారు. సాయంత్రం భక్తులు ఒక్కసారిగా తిరుగు ప్రయాణం కావడంతో జాతీయ రహదారి 163పై వరంగల్‌-హైదరాబాద్‌ మార్గంలో గూడూరు టోల్‌ప్లాజా వద్ద వాహనాల రద్దీ నెలకొంది. యాదాద్రికి వెళ్లిన వాహనాలకు తోడు వరంగల్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చే వాహనాలు ఒక్కసారిగా టోల్‌ప్లాజాకు చేరుకోవడంతో అరకిలోమీటరు మేర వాహనాలు బారులు తీరాయి

. టోల్‌ప్లాజా మేనేజర్‌ సుధీర్‌ తన సిబ్బందితో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి రద్దీని నియంత్రించేందుకు ప్రయత్నించారు. టోల్‌ ప్లాజాలో 13కౌంటర్లు ఉండగా 9 కౌంటర్లు వరంగల్‌-హైదరాబాద్‌ మార్గం వైపు కేటాయించి రద్దీని నియంత్రించారు.

Related Posts

You cannot copy content of this page