SAKSHITHA NEWS

అలంపూర్ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర దేవాలయం లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రసాద్ స్కీం భవనాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ బి.ఎం సంతోష్ అన్నారు.గురువారం భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శ్రీనగర్ నుంచి వర్చువల్ గా ‘స్వదేశీ దర్శన్’లో భాగంగా ప్రసాద్ స్కీం భవనాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేశారు. గద్వాల ఐ.డి.ఓ.సి సమావేశం హాలులో కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ బి.ఎం సంతోష్ , అదనపు కలెక్టర్లు అపూర్వ చౌహాన్, ముసిని వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు పాల్గొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభ దృశ్యాన్ని ఎల్.ఈ.డి స్క్రీన్ ద్వారా వీక్షించారు. దేశంలో ఆరు వేల నాలుగు వందల కోట్లతో, యాబై మూడు ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ లో పర్యాటక అభివృద్ధిలో భాగంగా, ప్రసాద్ స్కీం భవన నిర్మాణానికి రూ.38 కోట్లు నిధులతో భక్తుల సౌకర్యార్థం దేవాలయంలో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు.

మౌలిక సదుపాయాల కల్పనకు ఉద్దేశించిన ప్రసాద్ పథకం దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షిస్తూ టెంపుల్ టూరిజంను పెంపొందించేందుకు దోహదపడుతుందని అన్నారు. మూడు ఎకరాల స్థలంలో భక్తుల కోసం అన్నదాన సత్రం, అధునాతన వంటగది, ఓపెన్ ఎయిర్ థియేటర్, వసతి భవనం, స్నానాల గదులు, దేవాలయం నుండి పర్యాటకుల వసతి భవనం వరకు సీసీ రోడ్డు, కార్ పార్కింగ్ ఇలాంటి ఎన్నో సౌకర్యాలను దేవాలయానికి వచ్చే భక్తుల కోసం అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు దాదాపు 90 శాతం పనులు పూర్తయినవని, మిగతా పని 10 శాతం పనులు పురోగతిలో ఉన్నాయని, వీటిని త్వరగతిన పూర్తి చేస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ.ఓ వీరభద్రప్ప, జోగులాంబ ఆలయ ఈఓ పురేందర్, కేంద్ర టూరిజం అధికారి ప్రవీణ్ కుమార్, చీఫ్ ఇంజనీర్ వెంకటరమణ, జిల్లా అధికారులు వారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS