తెలంగాణతో సీఎం కేసీఆర్‌కు ఉన్న బంధాన్ని ఎవరూ విడదీయలేరని

Spread the love


No one can break the bond of CM KCR with Telangana

తెలంగాణతో సీఎం కేసీఆర్‌కు ఉన్న బంధాన్ని ఎవరూ విడదీయలేరని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. బీఆర్​ఎస్​ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని ప్రతి పల్లె మురిసిపోతుందని.. పట్టణం మెరిసిపోతుందని వ్యాఖ్యానించారు.

రాష్ట్ర ప్రగతిని మెచ్చి దిల్లీలో ఉన్నోళ్లు అవార్డులు ఇస్తుంటే.. గల్లీలో ఉన్నోళ్లు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసనసభలో చర్చ ముగియగా.. చర్చకు మంత్రి కేటీఆర్​ ఈ మేరకు సమాధానం ఇచ్చారు.

ఈ సందర్భంగా కుటుంబ పాలనంటూ వచ్చే విమర్శలకు మంత్రి కేటీఆర్​ గట్టి కౌంటర్​ ఇచ్చారు. తమ ప్రభుత్వానిది కుటుంబ పాలనే అని.. రాష్ట్రంలోని 4 కోట్ల మంది తమ కుటుంబం అని పేర్కొన్నారు. తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులతో తమది పేగుబంధమని స్పష్టం చేశారు.

సింగరేణి కార్మికులకు ఉద్యోగ పదవీ విరమణ వయసు 61 ఏళ్లకు పెంచామన్న కేటీఆర్‌.. ఐటీఆర్‌ను కేంద్రం రద్దు చేసినా తెలంగాణ మాత్రం ఉజ్వలంగా ముందుకెళ్తుందని తెలిపారు. దేశం మెుత్తం మీద 4 లక్షల ఐటీ ఉద్యోగాలు వస్తే.. మూడో వంతు ఉద్యోగాలు తెలంగాణలోనే వచ్చాయని స్పష్టం చేశారు. చాక్లెట్‌ నుంచి రాకెట్‌ వరకు ప్రతి పరిశ్రమకు గమ్యస్థానం తెలంగాణే అన్న ఆయన.. వరల్డ్‌ గ్రీన్‌ సిటీగా హైదరాబాద్‌ నిలిచిందని వివరించారు.

దిల్లీలో అవార్డులిస్తుంటే.. గల్లీలో విమర్శలా..: తెలంగాణ ప్రజలు 8 సంవత్సరాల్లో రూ.4 లక్షల 27 వేల కోట్లు కేంద్రానికి ఇచ్చారని మంత్రి కేటీఆర్​ పేర్కొన్నారు. రూ.45 లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్‌ పెడితే.. అందులో రాష్ట్రానికి కేటాయించింది రూ.2 వేల కోట్లేనని మండిపడ్డారు.

ఈ క్రమంలోనే విభజన చట్టం ప్రకారం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్​ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న మిషన్​ భగీరథను కేంద్రం హర్​ ఘర్​ జల్​ పేరుతో కాపీ కొట్టిందని ఆరోపించిన ఆయన.. రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలకు దిల్లీలో ఉన్నోళ్లు అవార్డులు ఇస్తుంటే గల్లీలో ఉన్నోళ్లు విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

సాగునీటి రంగంతో పాటు అనేక రంగాల్లో తెలంగాణ గొప్ప విజయాలు సాధించిందని మంత్రి తెలిపారు. లక్ష జనాభాకు అత్యధిక మెడికల్‌ సీట్లు కలిగిన రాష్ట్రం తెలంగాణ అని వివరించారు. హైదరాబాద్‌లో 4 సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు రాబోతున్నాయని.. ప్రతి జిల్లాకు ఒక మెడికల్‌ కళాశాల, ఒక నర్సింగ్‌ కళాశాలను ఏర్పాటు చేస్తామని వివరించారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page