Nandamuri Taraka Rama Rao in providing state power to the weak sections of Badugu
గన్నవరం : బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం అందించడంలో మాజీ ముఖ్యమంత్రి డా.నందమూరి తారక రామారావు వహించిన పాత్ర కాదనలేని సత్యమని గన్నవరం జిల్లాపరిషత్ ప్రాదేశిక సభ్యురాలు అన్నవరపు ఎలిజబెత్ రాణి అన్నారు.
సినీ మరియు రాజకీయ రంగంలో ఎన్నో సంచనాలకు తెరదీసిన ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గన్నవరం శాసనసభ్యులు డా.వల్లభనేని వంశీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ బడుగు, బలహీన, అణగారిన వర్గాల నుండి రాజకీయ నాయకులను తెరపైకి తెచ్చిన మహానాయకుడు ఎన్టీఆర్ మాత్రమేనని, దివంగత ముఖ్యమంత్రి డా.వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరియు ఆయన తనయుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి దానిని కొనసాగిస్తున్నారని ఆమె కొనియాడారు.
వై.ఎస్.ఆర్.సి.పి గన్నవరం మండల అధ్యక్షులు పడమట సురేష్ మాట్లాడుతూ ఆయన రాజకీయాలలోకి రాకపూర్వం, వచ్చిన తర్వాత పోల్చుకుంటే రాజకీయ పదవులు మరియు ప్రజాప్రాతినిధ్యం విషయంలో అత్యధికంగా లాభపడింది బడుగు, బలహీన వర్గాలేనని నొక్కి వక్కాణించారు. ఆయన రాజకీయాల్లోకి రాకుంటే ఉన్న సామాజిక న్యాయం మచ్చుకైనా కనిపించేది కాదని జిల్లా వై.ఎస్.ఆర్.సి.పి నాయకులు మేచినేని బాబు తెలిపారు.
నటనలోనూ, రాజకీయంగాను విశ్వరూపం ప్రదర్శించిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని, ఆయన ఒక వ్యక్తి కాదని, ఒక శక్తి అని ఎన్టీఆర్ కళాపరిషత్ అధ్యక్షులు అబ్ధుల్ కలాం ప్రశంసించారు. గన్నవరం పట్టణ సర్పంచ్ నిడమర్తి సౌజన్య మాట్లాడుతూ ఎన్టీఆర్, వై.ఎస్.ఆర్ లు ఇద్దరూ మహోన్నత వ్యక్తులని, మహిళలకు ఆస్తిలో సమానవాటా కల్పించిన ఎన్టీఆర్ కు మహిళల ఆదరాభిమానాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు.
జగనన్న పాలనలో అదేవిధమైన అండదండలు మహిళలకు అందుతున్నాయని ఆమె గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం నుండి వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు మరియు ప్రజాప్రతినిధులు పెద్దఎత్తున హాజరై ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించారు.