తితిదేకి ఉచితంగా 10 ఈ-బస్సులను అందించిన ఎంఈఐఎల్

Spread the love

తితిదేకి ఉచితంగా 10 ఈ-బస్సులను అందించిన ఎంఈఐఎల్

తిరుమల భక్తుల కోసం 10 ఎలక్ట్రిక్ బస్సులను అందించిన ఎంఈఐఎల్

సుమారు రూ.18 కోట్ల విలువైన బస్సులను ఉచితంగా అందించిన సంస్థ

భక్తులకు సురక్షితమైన, కాలుష్యం లేని ప్రయాణాన్ని ఇవ్వనున్న బస్సులు

తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)కి.. ఎంఈఐఎల్ (మేఘా ఇంజినీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్) 10 ఎలక్ట్రిక్ బస్సులను ఉచితంగా అందించింది. అక్టోబర్​ 21, 2022న ఇచ్చిన హామీ మేరకు 10 ఈ-బస్సులను సిద్ధం చేసి.. మార్చి 27వ(సోమవారం) తేదీన తితిదేకి ఇచ్చింది. వేద పండితుల ప్రత్యేక పూజల అనంతరం ఈ భూరి విరాళాన్ని ఒలెక్ట్రా సీఎండీ కె.వీ ప్రదీప్.. తితిదే ఛైర్మన్ వై వి సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డికి అందించారు. అనంతరం సిబ్బందితో కలిసి బస్సులో కొద్ది దూరం ప్రయాణించి.. బస్సుల పనితీరు పట్ల తితిదే సంతృప్తి వ్యక్తం చేసింది.

‘మేక్​ ఇన్​ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్’ కార్యక్రమాల పేరు మీదుగా తితిదే మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ఎలక్ట్రిక్ బస్సులను ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ రూపొందించింది. వీటిని సమయానికి పుణ్యక్షేత్రానికి అందిచడానికి ఎంఈఐఎల్ కృషి చేసింది. ఈ బస్సులు భక్తులకు కాలుష్య రహిత ప్రయాణాన్ని అందించనున్నాయి. ఇవి వాయు, శబ్ధ కాలుష్యం తగ్గించి.. టీటీడిని క్లీన్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్‌గా మార్చనున్నాయని తితిదే ట్రస్ట్ తెలిపింది.

ఎంఈఐఎల్ 10 ఈ-బస్సులను ఉచితంగా అందించిన సందర్భంగా తితిదే ఛైర్మన్ వై వి సుబ్బారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. “తిరుమల కొండపై పర్యావరణాన్ని కాపాడేందుకు తితిదే ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. దానిలో భాగంగానే తిరుమల కొండపై భక్తులకు శబ్ధ, వాయు కాలుష్యం లేని ప్రయాణం అందించేందుకు కృషి చేస్తుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఎంఈఐఎల్ ముందుకు వచ్చి.. తితిదేకి సుమారు రూ.18 కోట్లు విలువైన..10 ఈ-బస్సులను ఉచితంగా అందించింది. తిరుమల కొండపై పర్యావరణాన్ని కాపాడటానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. వారం.. పదిరోజుల్లో కొండపై భక్తులకు ఈ-బస్సులు సేవలు అందిస్తాయి. ఇదివరకు ఉన్న డీజిల్ బస్సుల స్థానంలో ఈ-బస్సులు తిరుగుతూ ఈ ప్రదేశాన్ని ఉద్గార రహితంగా మారుస్తాయి.” అని తెలిపారు.

ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కేవీ.ప్రదీప్ ఈ బస్సులను తితిదేకి అందించారు. అనంతరం మాట్లాడుతూ .. “ఎంఈఐఎల్ భగవంతుని సేవలో ఎప్పుడూ ముందుంటుంది. దానిలో భాగంగా ఒలెక్ట్రా రూపొందించిన ఈ-బస్సులు తిరుమల కొండపై భక్తులకు పర్యావరణహిత ప్రయాణాన్ని అందిస్తాయి. ఈ-బస్సులు పర్యావరణాన్నిగణనీయంగా, సానుకూలంగా ప్రభావితం చేసి.. భక్తులకు సురక్షితమైన, కాలుష్యం లేని ప్రయాణం అందిస్తాయి. రాకపోకలు మరింత సాఫీగా సాగేందుంకు ఛార్జింగ్ పాయింట్లు కూడా ఏర్పాటు చేశాము. సంస్థ పురోగతి, భవిష్యత్తు ప్రయత్నాల్లో ఆ స్వామివారి ఆశీస్సులు మాపై ఉండాలని కోరుకుంటున్నాము” అని తెలిపారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page