Further development with roads
రోడ్లతో మరింత అభివృద్ధి
ఎంపీ ల్యాడ్స్ కింద 7 సిమెంట్ రోడ్లు మంజూరు
రోడ్ల మంజూరులో బడుగు, బలహీన వర్గాలకు అధిక ప్రాధాన్యత
టీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు వెల్లడి
సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:
సీఎం కేసీఆర్ రోడ్లు వంటి మౌళిక వనతుల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మరింత అభివృద్ధికి అవకాశం ఏర్పడిందని టీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రభుత్వం గ్రామీణ రోడ్లు అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో గ్రామాలు మరింత సర్వతోముఖాభివృద్ధిని సాధిస్తున్నాయని అన్నారు. గ్రామాల నుంచి సమీప మార్కెట్ కేంద్రాలకు నిత్యాససర వస్తువులు, అటవీ ఉత్పత్తులు, వ్యవసాయ ఉ త్పత్తులకు సంబంధించి పెద్ద ఎత్తున రవాణా పెరగడంతో రోజు రోజుకు వాహనాల రద్దీ పెరిగి, ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అన్నారు.
పెరుగుతున్న ఒత్తిడిని అధిగమించేందుకు ఉన్న రోడ్లను మరింతగా విస్తరించడం, మరికొన్నింటిని బలోపేతం చేయడంతో పాటు. గ్రామాల్లో కొత్తగా సీసీ రోడ్లను మంజూరు చేయడం జరుగుతుందని నామ పేర్కొన్నారు. ఈ క్రమంలో తాజాగా ఖమ్మం జిల్లాలో రూ. 30 లక్షలతో ఎంపీ ల్యాడ్స్ కింద ఏడు సిమెంట్ రోడ్లను మంజూరు చేసినట్లు నామ పేర్కొన్నారు. ఈ విషయంలో బడుగు, బలహీన వర్గాలకు సంబంధించిన ప్రాంతాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి సీసీ రోడ్లు మంజూరు చేయడం జరుగుతుందని నామ తెలిపారు.
తాజాగా దళిత సామాజిక వర్గానికి సంబంధించి కొణిజర్ల మండలం లింగగూడెం, నేలకొండపల్లి మండలం చెన్నారం, ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి కూసుమంచి మండలం లోక్యాతండా, జనరల్ కేటగిరికీ సంబంధించి నేలకొండపల్లి మండలం సుర్ధేపల్లి, వైరా మండలం తాటిపూడి, ముదిగొండ మండలం కమలాపురం గ్రామాలకు ఏడు సీసీ రోడ్లు మంజూరు చేసినట్లు ఎంపీ నామ తెలిపారు.