నకిలీ వేలిముద్రలతో బ్యాంక్ అకౌంట్ ఖాళీ.. ఐదుగురు సైబర్ నేరగాళ్లు అరెస్ట్
కడప: నకిలీ వేలిముద్రల ఆధారంగా ఖాతాదారులకు తెలియకుండానే వారి ఖాతా నుంచి నగదును డ్రా చేస్తున్న ఐదుగురు అంతర్ జిల్లా సైబర్ నేరగాళ్లను కడప పోలీసులు అరెస్టు చేశారు..
అరెస్టు అయిన వారిని వైఎస్ఆర్ జిల్లా ఎస్పీ అన్బురాజన్ మీడియా ఎదుట హాజరు పరిచారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఐదుగురిపై దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నాలుగు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. వారిపై 412 ఫిర్యాదులు రాగా.. 416 మంది బాధితులను గుర్తించారు.
కడప చిన్నచౌక్కు చెందిన శంకరయ్య ఖాతా నుంచి రూ.5,500 నగదును అతడికి తెలియకుండా సైబర్ నేరగాళ్లు కాజేశారు. తనకి ఓటీపీ రాలేదని.. ఎలాంటి లింక్లు కూడా క్లిక్ చేయలేదని శంకరయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు విచారణ ప్రారంభించారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా విచారించగా నకిలీ వేలిముద్రల ద్వారా నగదును డ్రా చేసినట్టు విచారణలో తేలింది. దీంతో నిందితుల వివరాలను పోలీసులు సేకరించి ఐదుగురు అంతర్ జిల్లా సైబర్ నేరగాళ్లను అరెస్టు చేశారు. ఇప్పటివరకు నిందితులు 12 ఖాతాల ద్వారా రూ.5.9 కోట్ల ఆర్థిక లావాదేవీలు జరిపినట్లు గుర్తించామని ఎస్పీ తెలిపారు..