మనోహరాబాద్‌: జిల్లాలో అక్రమంగా మట్టిని తరలిస్తున్నా, అధికారులు తమకు పట్టనట్లు

Spread the love

మెదక్‌:చేగుంట, తూప్రాన్‌, వెల్దుర్తి, శివ్వంపేట, నర్సాపూర్‌, హవేలిఘనపూర్‌, పాపన్నపేట, టేక్మాల్‌, మనోహరాబాద్‌: జిల్లాలో అక్రమంగా మట్టిని తరలిస్తున్నా, అధికారులు తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇళ్ల నిర్మాణాలకు, వెంచర్ల ఏర్పాటుకు మట్టి వినియోగం తప్పనిసరి కావడంతో ఈ దందా జోరుగా కొనసాగుతోంది. నిబంధనలు ప్రకారం తవ్వకాలు జరపాలంటే మైనింగ్‌, రెవెన్యూ శాఖల అధికారుల అనుమతి తీసుకోవాలి. అయితే ఇవేవీ లేకుండానే కొనసాగిస్తున్నారు.

తరుగుతున్న గుట్టలు

టేక్మాల్‌ రామేశ్వర గుట్ట, ఎల్లంపల్లి చిన్నగుట్ట నుంచి, కాదులూర్‌, వెంకటాపూర్‌, బొడ్మట్‌పల్లి శివారు నుంచి వెంచర్లకు, నూతనంగా నిర్మించే ఇళ్లకు తరలిస్తున్నారు. శివ్వంపేట మండలం నవాబ్‌పేట, సికింద్లాపూర్‌, రూప్లాతండా చెరువులు, కుంటల్లో  తవ్వకాలు జరపడంతో గుంతలు పడ్డాయి. పాపన్నపేట మండలం పాపన్నపేట, నామాపూర్‌, అర్కేల, లక్ష్మీనగర్‌, మిన్పూర్‌ల్లో తవ్వకాలు కొనసాగుతున్నాయి. తూప్రాన్‌ మండలం నాగులపల్లి, జెండాపల్లి, బ్రాహ్మణపల్లి, వెంకటాపూర్‌ల్లో చెరువుల నుంచి రాత్రి సమయంలో మట్టిని తవ్వి తరలిస్తున్నారు.  మనోహరాబాద్‌ మండలం కూచారం, రంగాయపల్లి, కాళ్లకల్‌లోనూ  ఇదే పరిస్థితి నెలకొంది.

వెంచర్లకు తరలిస్తూ

నర్సాపూర్‌ పట్టణం పరిధిలోని హనుమంతపూర్‌ అసైన్డ్‌ భూముల నుంచి పెద్ద ఎత్తున మట్టిని వెంచర్లకు తరలిస్తున్నారు. రైతులకు నామమాత్రపు నగదు చెల్లించి యంత్రాలతో తవ్వకాలు జరపడంతో లోతైన గుంతలు ప్రమాదకరంగా మారుతున్నాయి. అటవీ ప్రాంతానికి ఆనుకుని కొండలను తవ్వేస్తున్నారు. నార్సింగి మండలం మల్లన్న గుట్ట సమీపంలో ఉన్న ప్రభుత్వ భూముల నుంచి మట్టిని తవ్వుతూ వెంచర్లకు తీసుకెళ్తున్నారు. చేగుంట మండలంలోని  వివిధ గ్రామాల్లోని చెరువులు, కుంటల నుంచి తరలిస్తున్నారు. హవేలిఘనపూర్‌ మండల కేంద్రంతో పాటు బూర్గుపల్లి, శమ్నపూర్‌, తదితర గ్రామాల్లో అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు జరుపుతున్నారు.

చాలా వరకు నియంత్రించాం

జయరాజ్‌, ఏడీ, గనులు, భూగర్భ శాఖ

కలెక్టర్‌ ఆదేశాల మేరకు జిల్లాలో మట్టి రవాణాను చాలా వరకు నియంత్రించాం. మండలాల్లో ఆయా శాఖల అధికారులతో బృందాలను ఏర్పాటు చేసి మట్టి తవ్వకాలు, రవాణా జరిగితే జరిమానాలు విధిస్తున్నాం. దీంతో కొంత తవ్వకాలు తగ్గాయి. అవసరం ఉన్న వారు అనుమతుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించాం. ఇంకా ఎక్కడైనా దందా జరుగుతుంటే ఫిర్యాదు చేస్తే, పరిశీలించి చర్యలు తీసుకుంటాం

Related Posts

You cannot copy content of this page