SAKSHITHA NEWS

చంద్రబాబు, లోకేష్ గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీ నేతలకు ఉందా.

!

  • సుదీర్ఘ రాజకీయ అనుభవం చంద్రబాబు సొంతం
  • దాడులు చేస్తున్నా సంయమనం పాటించిన చరిత్ర చంద్రబాబుది
  • టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్.

  • గుడివాడ : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీ నేతలకు ఉందా అని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, కార్యకర్తల సంక్షేమ నిధి కోఆర్డినేటర్ శిష్ట్లా లోహిత్ ప్రశ్నించారు.
  • కృష్ణాజిల్లా గుడివాడలో శిష్ట్లా లోహిత్ ఒక ప్రకటన విడుదల చేశారు. 40 ఏళ్ళకు పైగా సుదీర్ఘ రాజకీయ అనుభవం చంద్రబాబు సొంతమని అన్నారు. 14 ఏళ్ళ పాటు ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత ప్రతిపక్షనేతగా రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు శ్రమిస్తూ వస్తున్నారని గుర్తు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ పేదలకు అన్నం పెట్టాలన్న ఉద్దేశ్యంతో రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్లను చంద్రబాబు ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఏడు సార్లు శాసనసభకు ప్రాతినిథ్యం వహించిన కుప్పం నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ ను తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఏర్పాటు చేశాయన్నారు.
  • దీన్ని చంద్రబాబు పర్యటనలో ఉండగా వైసీపీ శ్రేణులు ధ్వంసం చేశాయన్నారు. అయినప్పటికీ అన్నా క్యాంటీన్ ను పునర్నిర్మించి చంద్రబాబు స్వయంగా పేదలకు భోజనం వడ్డించారన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్, నాయకులపై వైసీపీ గూండాలు దాడులు చేసినప్పటికీ సంయమనం పాటించిన చరిత్ర చంద్రబాబుది అని అన్నారు. చంద్రబాబు జీవితం తెరిచిన పుస్తకమని తెలియని వైసీపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారు. సీఎం జగన్మోహనరెడ్డి మెప్పు కోసం చంద్రబాబు, లోకేష్ లపై వ్యక్తిగత విమర్శలకు కూడా దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నారా లోకేష్ నెల్లూరు జిల్లా పర్యటనతో అధికార పార్టీ నేతల్లో ఆందోళన కన్పిస్తోందన్నారు. టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు నారా లోకేష్ కు ఘనస్వాగతం పలికారని చెప్పారు. ముసునూరు హరిజనవాడపాలెంలో మృతి చెందిన కరుణాకర్ కుటుంబాన్ని నారా లోకేష్ పరామర్శించి ధైర్యం చెప్పారన్నారు. వైసీపీ నేతల అరాచకాలకు గురైన ప్రతి కుటుంబానికీ తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని నారా లోకేష్ భరోసా ఇచ్చారన్నారు. చంద్రబాబు, నారా లోకేష్ పై పనిగట్టుకుని విమర్శిస్తున్న వైసీపీ నేతలకు ఏ మాత్రం సంస్కారం ఉందో అర్ధం చేసుకోవచ్చన్నారు . ఇదిలా ఉండగా చెన్నుపాటి గాంధీపై జరిగిన హత్యాయత్నం కేసును నీరుగారుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కుప్పంలో సాధారణ నిరసనలు చేపట్టిన టీడీపీ నాయకులపై హత్యాయత్నం కేసులు పెట్టి రిమాండ్ కు పంపారన్నారు. చెన్నుపాటి గాంధీపై దాడి చేసి కన్ను పోగొట్టిన నిందితుల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించడం లేదని శిష్ట్లా లోహిత్ తప్పుబట్టారు.

SAKSHITHA NEWS