దళితబంధు యూనిట్లతో ఆర్థికంగా ఎదగాలి జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

Spread the love

District Collector V.P. should grow economically with Dalit Bandhu units. Gautham

దళితబంధు యూనిట్లతో ఆర్థికంగా ఎదగాలి జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్


సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:

దళితబంధు యూనిట్లతో ఆర్థికంగా ఎదగాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టర్ చింతకాని మండలం రామకృష్ణాపురం, ఆనంతసాగర్ గ్రామాల్లో పర్యటించి, గ్రౌండింగ్ అయిన దళితబంధు యూనిట్ల నిర్వహణను క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దళితబంధు పథకంతో నెలకొల్పిన యూనిట్లను మంచిగా నిర్వహించుకుంటూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని లబ్ధిదారులకు సూచించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ గ్రామాల్లో గ్రౌండింగ్ అయిన జిరాక్స్, డిటిపి సెంటర్, కాంక్రీట్ లిఫ్టర్, జెసిబి, గొర్రెలు, టెంట్ హౌస్, గూడ్స్ ట్రాలీ, డీజే, ఎలక్ట్రికల్ షాప్, కార్లు మొదలగు యూనిట్లు పరిశీలించి, లబ్ధిదారులతో యూనిట్ల అభివృద్ధి గురించి, లాభాల గురించి అడిగి తెలుసుకున్నారు

. యూనిట్ల మంజూరుకు ముందు ఏం చేసేవారు, అప్పుడు ఆర్థిక స్థితి ఎలా ఉంది, ప్రస్తుతం ఎలా ఉంది అడిగి తెలుసుకున్నారు. యూనిట్ల నిర్వహణ స్వయంగా చేసుకోవాలని, అప్పుడే లాభదాయకంగా ఉంటుందని అన్నారు. నిర్వహణ విషయమై శిక్షణ ఇచ్చినట్లు, అవసరమైతే అధికారుల సహాయ సహకారాలు తీసుకోవాలన్నారు.

పశువైద్యులు గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి, గ్రౌండింగ్ అయిన గొర్రెలు, డెయిరీ యూనిట్లకు కావాల్సిన చికిత్సలు అందించాలని, వాటి నిర్వహణ విషయమై లబ్దిదారులకు అవగాహన కల్పించాలని అన్నారు. యూనిట్ల నిర్వహణకు మంజూరు మొత్తం నుండి వాడరాదని, యూనిట్ల ద్వారా వచ్చే ఆదాయంతోనే నిర్వహించాలని అన్నారు.

దళిత బంధు యూనిట్లను మరింత అభివృద్ధి చేసుకోవడంతో పాటు మరికొందరికి ఉపాధి కల్పించేలా ఎదగాలన్నారు. మొదటి దశలో యూనిట్లను గ్రౌండింగ్ చేసేందుకు డబ్బులు ఇచ్చామని, మిగిలిన మొత్తం మంజూరుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

లాభాదాయకమైన యూనిట్లను నెలకొల్పి లబ్ధిదారులు స్వయంకృషితో యూనిట్లను బాగా అభివృద్ధి చేసుకోని, మరికొంతమందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని అన్నారు. ఆనంతసాగర్ గ్రామంలో దళితబంధు పథకం ద్వారా నారపోగు లక్ష్మీకి మంజూరయిన కార్ ను కలెక్టర్ అందించారు.

అంతకుముందు కలెక్టర్, భారతరత్న డా. బి.ఆర్. అంబెడ్కర్ వర్థంతిని పురస్కరించుకుని రామకృష్ణాపురం గ్రామ పంచాయితీ కార్యాలయం, ఆనంతసాగర్ గ్రామంలోని డా. బి.ఆర్. అంబెడ్కర్ విగ్రహాల వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.


ఈ యూనిట్ల పరిశీలన కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఇడి ఇ. శ్రీనివాసరావు, జిల్లా రవాణాధికారి టి. కిషన్ రావు, జిల్లా బిసి సంక్షేమ అధికారిణి జ్యోతి, జిల్లా సహకార అధికారి విజయ కుమారి, జిల్లా పశుసంవర్ధక అధికారి డా. వేణు మనోహర్, జిల్లా వ్యవసాయ అధికారిణి సరిత, ఇఇ పీఆర్ కెవికె. శ్రీనివాస్, చింతకాని మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు, తహసీల్దార్ మంగీలాల్, గ్రామ సర్పంచ్ లు కుటుంబ రావు, మంగతాయమ్మ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page