ఐసిడిఎస్ కార్యక్రమాల పట్ల మరింత అవగాహన కల్పించాలి- జిల్లా కలెక్టర్

Spread the love

*సాక్షిత మచిలీపట్నం : గర్భవతులు, బాలింతలు, శిశు ఆరోగ్య సంరక్షణ, కిషోర్ బాలికలు, మహిళల పరిరక్షణ కార్యక్రమాల పట్ల ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు ఐసిడిఎస్ అధికారులను ఆదేశించారు.

స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ఐసిడిఎస్ ద్వారా అమలయ్యే కార్యక్రమాల అమలు, పర్యవేక్షణ గురించి బుధవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఐసిడిఎస్ అధికారులతో సమీక్షించారు.

ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గర్భవతులు, బాలింతలు, పిల్లలకు పోషకాహారం అందించి ఆరోగ్యవంతమైన సమాజం లక్ష్యంగా ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా వైయస్సార్ సంపూర్ణ పోషణ కార్యక్రమం అమలు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమం కింద గర్భవతులు, బాలింతలకు ఇటీవల టెక్ హోమ్ రేషన్ విధానం అమలు చేస్తున్న విషయం కలెక్టర్ గుర్తుచేసారు. అయినప్పటికీ జిల్లాలో పోషకాహార లోపం ఎనీమియా కేసులు ఎందుకు వస్తున్నాయని అధికారులను కలెక్టర్ ప్రశ్నించారు.

కాన్వెంట్లకు వెళ్లే పిల్లలు, పుట్టుకతో బలహీనంగా ఉన్న పిల్లలు, ఆరోగ్య లోపాలతో పుట్టిన పిల్లల్లో, కొన్నిచోట్ల సంచార కుటుంబాలలో, పరిసరాల పరిశుభ్రత పాటించకపోవడం వంటి కారణాల వలన ఎక్కువగా పోషకాహార లోపం కనబడుతున్నదని సమావేశంలో విశ్లేషించారు. ఇట్టి కుటుంబాలను గుర్తించి ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారం వారు సక్రమంగా తీసుకునేలా గృహ సందర్శనలు ద్వారా పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు.

అంగన్వాడి కార్యకర్తలు, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు వారి వారి పరిధిలో పోషకాహార లోపం గా గుర్తించిన వారి కుటుంబాలను సందర్శించి వారికి తగిన కౌన్సిలింగ్ ఇచ్చి, పోషకాహారం తీసుకునేలా చూడాలని తద్వారా ఎనీమియా నివారణకై కృషి చేయాలన్నారు. పిల్లల్లో పోషకాహార లోపం అనీమియా, వయసుకు తగిన ఎత్తు, బరువు లోపాలు రాకుండా గృహ సందర్శనలు పెంపు చేయాలన్నారు.

బాల్య వివాహాల నిరోధక చట్టం పటిష్ట వంతంగా అమలు అయ్యేలా చూడాలన్నారు.

1098 చైల్డ్ హెల్ప్ లైన్, 181 ఉమెన్ హెల్ప్ లైన్ గురించి మరింత అవగాహన కల్పించాలని, ఐసిడిఎస్ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకు వెళ్లడానికి అవగాహన కార్యక్రమాలు రూపొందించి నివేదిక సమర్పించాలన్నారు.

సమావేశంలో “బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం, తస్మాత్ జాగ్రత్త” పోస్టర్లు స్టిక్కర్లను ఐసిడిఎస్ అధికారులతో కలిసి కలెక్టర్ విడుదల చేశారు.

ఈ సమావేశంలో ఐసిడిఎస్ పిడి ఎస్ సువర్ణ, సమగ్ర శిశు సంరక్షణ పథకం ( ఐ సి పి ఎస్) డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ జాన్సన్, సిడిపివోలు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page