మన ఊరు- మనబడి కార్యక్రమంలో మొదటి విడత కింద తీసుకున్న 426 పాఠశాలల అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి టీఎస్ ఈడబ్ల్యుఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
మన ఊరు- మనబడి కార్యక్రమంలో భాగంగా మొదటి విడత కింద తీసుకున్న 426 పాఠశాలల అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని టీఎస్ ఈడబ్ల్యుఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఐడిఓసి సమావేశ మందిరంలో మన ఊరు మనబడి కార్యక్రమం కింద చేపడుతున్న పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తో కలిసి విద్యాశాఖ అధికారులు, వివిధ ఇంజనీరింగ్ విభాగాల ఇఇ, డిఇ, ఏఇలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, ఖమ్మం జిల్లాలో మన ఊరు మన బడి కార్యక్రమం కింద మొదటి విడతగా 426 పాఠశాలలను ఎంపిక చేయడం జరిగిందని, పనులు వివిధ దశల్లో పురోగతిలో వున్నాయన్నారు. అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మన ఊరు మనబడి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరి పాత్ర ఎంతో అవసరమని అన్నారు.
ప్రభుత్వ పాఠశాలలకు పేద, మధ్యతరగతి పిల్లలు విద్యను అభ్యసించడానికి వస్తారని, పాఠశాలలను అభివృద్ధి చేసినట్లయితే వారికి మంచి భవిష్యత్తు ఇచ్చిన వారం అవుతామని అన్నారు. పాఠశాలల్లో 12 రకాల పనులను పక్కగా చేపట్టేందుకు ఏఇ, డిఈ, ఎంఈఓ లు ఎక్కువ సమయం తీసుకుని పనులు పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆయన అన్నారు.
పంచాయత్ రాజ్, రోడ్లు భవనాల , నీటిపారుదల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పర్యటిస్తూ పనుల పురోగతిని వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో మంచి విద్యను అందించేందుకు, అన్ని మౌలిక సౌకర్యాలతో కూడిన వసతులను కల్పిస్తూ విద్యాభివృద్ధికి కృషి చేస్తుందని అన్నారు .
పాఠశాల మరమ్మతులు, మరుగుదొడ్ల నిర్మాణం, వంట గదులు, త్రాగునీరు తో పాటు ప్రహరీ గోడలను నిర్మించడం జరుగుతుందని ఆయన తెలిపారు. నిర్మాణ పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలన్నారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో చేపట్టే పనులకు ఎటువంటి నిధులకు కొరతలేదని, ఎప్పటికప్పుడు చెల్లింపులు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు.
మన ఊరు మన బడిలో భాగంగా 30 లక్షలకు రూపాయలకు పైగా చేపట్టాల్సిన పెండింగ్ పనులకు టెండర్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని తెలిపారు. పాఠశాలల్లో ఉన్న స్థలాన్ని సద్వినియోగం చేసుకొని నిర్మాణాలు చేపట్టే దగ్గర కార్యాచరణ చేయాలన్నారు.
విద్యాశాఖ, ఇంజనీరింగ్ శాఖ, పాఠశాల నిర్వహణ కమిటీలు సమన్వయం తో పనుల పూర్తికి చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎన్ని పాఠశాలల పనులు పూర్తి అయి, ప్రారంభోత్సవానికి సిద్ధంగా వున్నాయో జాబితా ఇవ్వాలన్నారు. పనులు పూర్తయినచోట ఈ నెల 10 లోగా ప్రారంభోత్సవం పండుగలా చేపట్టాలన్నారు. 3 నెలలు కష్టపడి పనిచేయాలని, ప్రతీవారం ప్రారంభోత్సవాలు జరగాలని, మే 31 లోగా అన్ని పాఠశాలలు పనులు పూర్తయి ప్రారంభోత్సవం జరగాలన్నారు.
పనులు పూర్తికాగానే ఎంబి రికార్డు, ఎఫ్డివోల జనరేషన్ వెంట వెంటనే పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం చేయాలన్నారు. దాతలను ప్రోత్సహించాలని, పాఠశాలల అభివృద్ధి లో పాలుపంచుకొనేలా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. దేశంలోనే మన పాఠశాలలు మంచి పాఠశాలలుగా గుర్తింపు పొందాలన్నారు. సమీక్ష లో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో మొదటి విడతగా 426 పాఠశాలలను ఎంపిక చేసి, పనులు చేపట్టినట్లు తెలిపారు.
విద్యాశాఖ ద్వారా చేపట్టిన పనులు 104 పాఠశాలల్లో పూర్తికాగా, 322 పాఠశాలల్లో పురోగతిలో ఉన్నాయన్నారు. 12 పాఠశాలలు పనులు పూర్తిచేసుకుని పునః ప్రారంభోత్సవం చేసుకున్నామన్నారు. ఉపాధి హామీ క్రింద 66 పాఠశాలల్లో పనులు పూర్తి కాగా, 306 పాఠశాలల్లో ప్రగతిలో ఉన్నాయన్నారు. మార్చి నెలాఖరు కల్లా 50 శాతం పాఠశాలల పనులు పూర్తిచేయాలని, మిగులు పాఠశాలల పనులు విద్యా సంవత్సరం ప్రారంభం లోగా పూర్తి చేయాలని ఆయన తెలిపారు.
ప్రతిపాదనలు ఇంకనూ పెండింగులో ఉంటే వెంటనే సమర్పించాలన్నారు. ఉపాధి హామీ నిధుల విడుదలకు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. పెయింటింగ్, డ్యూయల్ డెస్క్ ల సరఫరా జాప్యం కాకుండా చూడాలన్నారు. ప్రజలు భాగస్వామ్యం అయ్యేలా చర్యలు చేపట్టనున్నట్లు, ఎన్ఆర్ఐ లను పాఠశాలల అభివృద్ధికి చేయుతకు కోరనున్నట్లు ఆయన అన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పనులు పూర్తయి, విద్యార్థులు ఉత్సాహంగా, క్రొత్త వాతావరణంలో మంచిగా విద్యను అభ్యసిస్తారని కలెక్టర్ తెలిపారు.
ఈ సమీక్షా సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహాలత మొగిలి, జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖరశర్మ, డిఆర్డీఓ విద్యాచందన, ఇఇలు నాగశేషు, కెవికె. శ్రీనివాస్, చంద్రమౌళి, శ్యామ్ ప్రసాద్, ఎంఐఎస్ రామకృష్ణ, వ్ఎంఇఓ లు, వివిధ ఇంజనీరింగ్ శాఖల డిఇలు, ఎఇలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.