పేదలు గొప్పగా, ఆత్మగౌరవంతో బ్రతకాలనే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు లక్ష్యం

Spread the love

పేదలు గొప్పగా, ఆత్మగౌరవంతో బ్రతకాలనే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు లక్ష్యం మేరకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి అర్హులకు ఉచితంగా అందజేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. శనివారం మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని బహదూర్ పల్లిలో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంత్రి శ్రీనివాస్ యాదవ్ MLA లు వివేక్, మాధవరం కృష్ణారావు లతో కలిసి ప్రారంభించారు. ముందుగా కాలనీలో మంత్రి మొక్కలను నాటారు.

బహదూర్ పల్లిలో 76.50 కోట్ల రూపాయల వ్యయంతో 900 ఇండ్లు, D పోచంపల్లిలో 140 కోట్ల రూపాయల వ్యయంతో 1620, గాజుల రామారంలో 11 కోట్ల రూపాయల వ్యయంతో 144 ఇండ్ల సముదాయాలను నిర్మించారు. ర్యాండో మైజేషన్ పద్దతిలో డ్రా నిర్వహించి సనత్ నగర్, కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, కంటోన్మెంట్ నియోజకవర్గాలకు చెందిన 1700 మంది లబ్ధిదారులకు ఇండ్లను కేటాయిస్తూ మంత్రి పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఇల్లు కట్టి చూడు….పెండ్లి చేసి చూడు అని మన పెద్దలు ఎప్పుడు చెబుతుంటారని, ఆ రెండు ఎంతో కష్టతరమైనవని అన్నారు. మన ముఖ్యమంత్రి ఒక వైపు ఉచితంగా ఇల్లు నిర్మించి ఇస్తుండగా, మరో వైపు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ క్రింద లక్ష రూపాయలు చొప్పున ఆర్ధిక సహాయం అందిస్తున్న గొప్ప మనసున్న మాహా రాజు అని పేర్కొన్నారు.

ఈ ఇండ్లకు ముఖ్యమంత్రి డిజైన్ చేశారని చెప్పారు. ఎలాంటి రాజకీయ ప్రమేయం లేకుండా పారదర్శకంగా ఆన్ లైన్ డ్రా నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందని వివరించారు. లబ్దిదారులపై ఒక్క పైసా భారం పడకుండా ప్రభుత్వమే అన్ని వసతులతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఉచితంగా పంపిణీ చేస్తుందని చెప్పారు. గత ప్రభుత్వాలు పేదలకు పలు పథకాల క్రింద చేపట్టిన ఇండ్ల నిర్మాణాలలో ప్రభుత్వం అందించిన ఆర్ధిక సహాయం నామమాత్రమేనని, ఆ ఇండ్లు కూడా ఎంతో ఇరుకుగా ఉండేవని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన ఇల్లు ఎంతో విశాలంగా 2 బెడ్ రూమ్ లు, కిచెన్, హాల్, 2 టాయిలెట్స్ ఉన్నాయని చెప్పారు.

దేశంలో ఇంత గొప్ప కార్యక్రమం ఎక్కడా లేదని అన్నారు. పేద ప్రజల సొంత ఇంటి కల నెరవేర్చాలనే సదుద్దేశంతో GHMC పరిధిలో 109 ప్రాంతాలలో 10 వేల కోట్ల రూపాయల వ్యయంతో లక్ష ఇండ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని, ఇందులో 73 ప్రాంతాలలో 69,532 ఇండ్ల నిర్మాణం పూర్తయిందని, మరో 36 ప్రాంతాలలో 30, 468 ఇండ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని వివరించారు. ఈ ఇండ్లను దశల వారిగా అర్హులైన వారికి పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కొందరు దుర్మార్గులు ప్రజలను తప్పుదారి పట్టించే, రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని… వారి మాటలు పట్టించుకోవద్దని మంత్రి కోరారు. మొదటి విడతలో GHMC పరిధిలోని 8 ప్రాంతాలలో ఈ ఒక్క రోజే ఒక్కో నియోజకవర్గంలో 500 మంది చొప్పున 11, 700 మందికి లబ్దిదారులకు ఇండ్లను పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. మొదటి విడతలో రానివారు ఆందోళన చెందవద్దని, దశల వారిగా దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్లు ఇస్తామని స్పష్టం చేశారు.

ఆనందం వ్యక్తం చేసిన లబ్దిదారులు

ఎన్నో సంవత్సరాల కోరిక సొంత ఇంటి కల నేడు నెరవేరడంతో లబ్దిదారులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇండ్ల కేటాయింపు పత్రాలను అందుకున్న పలువురు మహిళలు వేదికపైనే తమ సంతోషాన్ని వ్యక్త పరిచారు. ఒక్క రూపాయల ఖర్చు లేకుండా తమకు ఇల్లు ఉచితంగా నిర్మించి ఇచ్చిన ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు, తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో GHMC కమిషనర్ రోనాల్డ్ రోస్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, హౌసింగ్ CE సురేష్, EE వెంకటదాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page