SAKSHITHA NEWS

అధికారపార్టీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకులు చెబితేనే లబ్ధి
కార్పొరేషన్ లను నిర్వీర్యం చేసి కార్యకర్తలకు మేలు చేసే స్కీములు
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్

వెనుకబడిన వర్గాల రూ. లక్ష పథకం బీఆర్ఎస్ కార్యకర్తల కోసమేనని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల చేతుల్లోనే ఈ పథకం ఉ ందన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఎలాంటి పైరవీలు లేని అత్యధికులకు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు లేవని తెలిపారు. ఈ ధ్రువీకరణ పత్రాల కోసం తహశీల్దార్ కార్యాలయాలు చుట్టూ నెలల తరబడి తిరగాల్సి వస్తుందని పేర్కొన్నారు. మీ సేవలో దరఖాస్తు చేసి తహశీల్దార్ కార్యాలయంలోని బాక్సుల్లో వేస్తే రోజుల తరబడి ఆ పెట్టెలు తెరిచే పరిస్థితి లేదని తెలిపారు. ఇలా వేలాదిగా దరఖాస్తులు వస్తున్నా వాటిని పట్టించుకొనే దిక్కులేదని మండిపడ్డారు.

మరోవైపు విద్యార్థుల సర్టిఫికెట్లను పక్కకు పెట్టి ఈ దరఖాస్తులు మీదనే రెవెన్యూ సిబ్బంది దృష్టి కేంద్రీకరించడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారని ధ్వజమెత్తారు. దీనికి తోడు రూ. లక్ష పథకం విషయంలో పైరవీలు కూడా ఊపందుకున్నాయని ఆరోపించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు పదుల సంఖ్యలో దరఖాస్తులు తీసుకువస్తే వెంటనే సైట్ ఓపెన్ చేసి వాటిని క్లియర్ చేస్తున్న అధికారులు, పైరవీలు లేని అప్లికేషన్లను మాత్రం రోజుల తరబడి పెండింగ్లో పెడుతుండటంపై పొంగులేటి మండిపడ్డారు. లక్షలాదిగా బీసీలు దరఖాస్తు చేస్తుంటే వేలల్లోనూ రూ. లక్ష ఇచ్చే పరిస్థితి లేదని పేర్కొన్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో బీఆర్ఎస్ బీసీ కార్యకర్తలు చేజారకుండా ఉండేందుకు వారికి మాత్రమే లబ్ధి చేకూర్చేందుకు ఈ పథకాన్ని తీసుకువచ్చినట్లు తెలిపారు. నిధుల్లో కోతపెట్టి కార్పొరేషన్ లను నిర్వీర్యం చేసిన ప్రభుత్వం బీసీలకు రూ. లక్ష పథకం పేరుతో మభ్యపెట్టేందుకు పూనుకుందని విమర్శించారు.


SAKSHITHA NEWS