హైదరాబాద్: ఉచిత విద్యుత్ పథకం అమల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ రంగానికి కేటాయింపులను గణనీయంగా పెంచింది. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీల ఇళ్లకు 101 యూనిట్ల వరకు, వ్యవసాయానికి ఉచితంగా కరెంటు సరఫరా అవుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు గృహజ్యోతి పథకం కింద ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచితంగా అందిస్తామని ఇప్పటికే ప్రకటించిన సర్కారు అమలుకు సిద్ధమవుతోంది. అందుకు అనుగుణంగా ‘గృహజ్యోతి’ పథకానికి ప్రత్యేకంగా బడ్జెట్‌లో రూ.2,418 కోట్లు కేటాయించింది. మొత్తంగా ఉచిత విద్యుత్తు అమలు కోసం విద్యుత్ రంగానికి రూ,16,825 కోట్లు ఇచ్చింది. గత బడ్జెట్‌లో కేటాయించిన రూ.11 వేల కోట్లతో పోలిస్తే ఈసారి కేటాయింపులు రూ.5,825 కోట్లు పెంచింది. ప్రస్తుతం రాయితీ పద్దు కింద ‘విద్యుత్ పంపిణీ సంస్థ’(డిస్కం)లకు నెలకు రూ.958 కోట్ల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తూ వస్తోంది. వచ్చే ఏప్రిల్ నుంచి రూ.1,402 కోట్ల చొప్పున నెలనెలా విడుదల చేసేలా కేటాయింపులను పెంచడం విశేషం.
అర్హులెవరో తేలితేనే
నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు కోసం 81.54 లక్షల కుటుంబాల వారు ఇటీవల దరఖాస్తులిచ్చారు. మరోవైపు సుమారు 90 లక్షల కుటుంబాలు నెలకు 200 యూనిట్లలోపు కరెంటు వినియోగిస్తున్నట్లు అంచనా. వీరిలో రేషన్‌కార్డు, ఆధార్, ఫోన్ నంబరు అనుసంధానమై ఉన్నవారిని తొలుత ఎంపిక చేయనున్నారు. ‘అర్హుల ఎంపికకు మార్గదర్శకాలు జారీ చేశాక దీనిపై మరింత స్పష్టత వస్తుంది. పథకం అమలు ప్రారంభమైన నెల రోజుల తర్వాత బిల్లులు జారీ అయితే నెలనెలా ఏ మేరకు నిధులు అవసరమవుతాయనే అంచనా వస్తుంది. అప్పటివరకు ప్రస్తుతం కేటాయించిన రూ.2,418 కోట్లు ఈ పథకానికి వినియోగిస్తాం. పూర్తిస్థాయి బడ్జెట్‌లో అవసరమైన మేరకు నిధులు కేటాయిస్తాం’ అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.