గిరిజన సంస్కృతి ఉట్టిపడేలా.. ఆదివాసీ,బంజారా భవన్లు సిద్ధం

Spread the love

Adivasi and Banjara buildings are prepared so that tribal culture can flourish

గిరిజన సంస్కృతి ఉట్టిపడేలా.. ఆదివాసీ,బంజారా భవన్లు సిద్ధం

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌ 10లో ఆదివాసీ గిరిజనుల ఆత్మగౌరవం ఉట్టిపడేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ఆదివాసీ, బంజారా భవనాలను ఈ నెల 17న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని ఆదివాసీ గిరిజనులు తమ సంస్కృతిని ప్రదర్శించేందుకు, సభలు, సమావేశాలు, సమ్మేళనాలు నిర్వహించుకొనేందుకు ప్రభుత్వం వీటిని నిర్మించింది

అనేక బాలారిష్టాలు, ఆటుపోట్లు, కోర్టు కేసులను దాటుకొని ఈ భవనాలు అద్భుతంగా కొలువుదీరాయి. తెలంగాణ సిద్ధించిన తొలినాళ్లలోనే ఒక్కో వర్గం ఆత్మగౌరవాన్ని సమున్నతంగా నిలబెట్టేలా హైదరాబాద్‌లో ఆత్మగౌరవ భవనాలు నిర్మించాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్‌.. ఆదివాసీ, బంజారా గిరిజనుల కోసం 2014లోనే బంజారాహిల్స్‌లో ఎకరం స్థలం కేటాయించారు. నిధులు విడుదల చేశారు. అయితే, అది కాందీశీకుల భూమి అని, సదరు భూమిపై తమకు హక్కులున్నాయంటూ కొందరు కేసు వేశారు. దీంతో హైకోర్టు స్టే ఇచ్చింది. తుదకు కేసీఆర్‌ పట్టుదల, ప్రభుత్వ వాదన నెగ్గాయి. హైకోర్టు సానుకూల తీర్పు ఇవ్వడంతో భవనాల నిర్మాణం సుగమం అయింది.

ఆరు మ్యూజియంలకు తోడు.. మరో రెండు

అనేక రాష్ర్టాల్లో రాష్ర్టానికో ఆదివాసీ గిరిజన భవనమో, మ్యూజియమో మాత్రమే ఉండగా తెలంగాణ ప్రభుత్వం ఆరు మ్యూజియంలను నిర్వహిస్తున్నది. ఉట్నూరు ఐటీడీఏ పరిధిలోని కెరమెరి జోడేఘాట్‌లో ఆదివాసీ పోరాట యోధుడు కుమ్రంభీం పేరుతో మ్యూజియాన్ని నిర్మించింది. ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలోని మేడారం, భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని భద్రాచలం, మన్ననూరు ఐటీడీఏ పరిధిలో మరొక మ్యూజియంను నిర్వహిస్తున్నది. వీటితోపాటు వరంగల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలం అశోక్‌నగర్‌, హైదరాబాద్‌ మాసబ్‌ట్యాంక్‌లోని సంక్షేమభవన్‌లో జవహర్‌లాల్‌ మ్యూజియంను నిర్వహిస్తున్నది. ఇందులో ఒకేఒక్క మ్యూజియాన్ని ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించగా స్వరాష్ట్రంలో మరో ఐదు మ్యూజియంలను నిర్మించడం విశేషం. ఈ ఆరు మ్యూజియంలతోపాటు ఆదివాసీ, బంజారాభవన్‌లలో వేర్వేరుగా నాలుగు గ్యాలరీలను నిర్మించారు. వీటిలో గ్రంథాలయం, ఫొటో, పెయింటింగ్స్‌, కళాకృతులను ఏర్పాటుచేశారు.

సంస్కృతుల సమ్మేళనంగా ..

ఆదివాసీ, బంజారా రెండు వేర్వేరు తెగలు. వీరి సంస్కృతి, సంప్రదాయాలు ప్రత్యేకమైనవి. ఆదివాసీ భవన్‌లో రాష్ట్రంలోని గోండు, కోయ, థోటి, పర్దాన్‌, నాయక్‌పోడ్‌, చెంచు తదితర 10 ఆదివాసీ తెగల సంస్కృతిని ప్రతిబించే కళాకృతులు, ఫొటో గ్యాలరీ, పెయింటింగ్స్‌ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బంజారాభవన్‌లో లంబాడీల జీవన విధానం, సంస్కృతిని తెలిపే విధంగా గ్యాలరీలను ఏర్పాటుచేశారు.

ఇదీ మన ప్రత్యేకత

రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌ ప్రకారం రాష్ట్ర జనాభాలో 5 శాతానికి మించి గిరిజనులు ఉంటే ఆ రాష్ర్టాన్ని గిరిజన రాష్ట్రంగా పరిగణిస్తారు. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో గిరిజన జనాభా 9.5%. దేశంలో అనేక రాష్ర్టాల్లో 12 నుంచి 40% గిరిజన జనాభా ఉన్న రాష్ర్టాల కంటే తెలంగాణలో ఆదివాసీ, గిరిజన సంస్కృతులకు సముచిత ప్రాధాన్యం లభిస్తుండటం విశేషం.

Related Posts

You cannot copy content of this page