కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ఆధార్‌ కార్డు తప్పనిసరి చేశారు.

Spread the love

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ఆధార్‌ కార్డు తప్పనిసరి చేశారు. విద్యార్థులకు అందే ప్రయోజనాల కోసం ఈ వివరాలను సేకరిస్తున్నారు. ప్రసుత్తం చదువుతున్న వారిలో చాలా మంది తమ వివరాలను అందజేయలేదు. దీంతో వారు నష్టపోతున్నారు. దీనిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీ ద్వారా ఆధార్‌ కార్డు, నవీకరణ వంటివి చేపడుతోంది.  ఇందుకోసం జిల్లాలో ఎంఆర్‌సీ  కంప్యూటర్‌ ఆపరేటర్లు, ఎంఐఎస్‌ సమన్వయకర్తలకు ఒక రోజు శిక్షణ ఇచ్చారు. ప్రతి వ్యక్తికి ఆధార్‌ ఉండాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి విధితమే. ప్రభుత్వ పథకాలకు, ఇతర వాటికి  అవసరం కావడంతో ప్రతి ఒక్కరు కార్డు పొందుతున్నారు. పలువురు చాలాఏళ్ల కిందట వివరాలు నమోదు చేయడంతో, వారివి నవీకరణ చేపడుతున్నారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా మండల కేంద్రాలు, పట్టణాల్లో కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటి వద్ద రద్దీ ఉండడంతో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న వారి వివరాల నమోదుకు ఓ ఏజెన్సీకి అప్పగించారు.

ప్రతి విద్యార్థికి పిన్‌ నంబరు

ఇప్పటికే ఆయా పాఠశాలల్లో విద్యార్థుల వివరాలను ఏజెన్సీ నిర్వాహకులు పొందుపర్చారు. ఇంకా కొందరు మిగిలిపోయి ఉండడంతో ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ప్రతి విద్యార్థికి పిన్‌ నంబరు ఇవ్వనుంది. అందువల్లే అందరికి ఆధార్‌ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. మండల వనరుల కేంద్రంలో (ఎంఆర్‌సీ) 2019లో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సాప్ట్‌వేర్‌లో మార్పులు రావడంతో కేంద్రాలకు ఇచ్చిన యంత్రాలను నవీకరిస్తున్నారు. జిల్లాలో ఇది వరకు 15 మండలాలకు ఈ యంత్రాలను అందజేయగా, ఇటీవల మెదక్‌లోని కస్తూర్బా పాఠశాలలో యంత్రాలను నవీకరణ చేశారు. జిల్లాలో ప్రస్తుతం ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు 1.35 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో ఇంకా 4,821 మంది విద్యార్థులకు సంబంధించిన ఆధార్‌ వివరాలు లేవు. దీంతో ప్రతి ఒక విద్యార్థికి ఆధార్‌ తప్పనిసరి కావడంతో వివరాలు లేని వారిని గుర్తించి, త్వరితగతిన నమోదు చేసేందుకు విద్యాశాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. మండల వనరుల కేంద్రం పరిధిలో ఉన్న పాఠశాలల విద్యార్థుల వివరాలను నవీకరణ చేయనున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు సమీపంలో ఉన్న ఎంఆర్‌సీ కేంద్రానికి వెళితే వివరాలను సాఫ్ట్‌వేర్‌లో పొందుపరుస్తారు. త్వరితగతిన అందరి వివరాల నమోదు చేసేలా చర్యలు తీసుకోనున్నారు.

Related Posts

You cannot copy content of this page