మంచిర్యాల జిల్లా :
బీఆర్ఎస్ పార్టీ ప్రకటించబోయే మేనిఫెస్టోతో ప్రతిపక్షాలకు దిమ్మతిరగాల్సిందే అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. మంచిర్యాలలో మంత్రి హరీశ్‌రావు వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
పెన్షన్లు ఎంత పెంచాలి.. రైతుబంధు ఎంత పెంచాలి.. మహిళలకు ఇంకా ఏం చేయాలని సీఎం కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నారని మంత్రి తెలిపారు. త్వరలోనే బీఆర్ఎస్ మేనిఫెస్టో రాబోతోంది.
ఆ మేనిఫెస్టో వచ్చిందంటే ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. దిమ్మతిరిగిపోతది. కేసీఆర్ అంటే నమ్మకం, విశ్వాసం. కాంగ్రెసోళ్లు అంటే నయవంచన.. నాటకం. ఓట్ల కోసం మాయమాటలు చెబుతున్నారు. కొట్లాడుకునే సంస్కృతి వారిది. ఒక్క మాటలో కాంగ్రెస్ సంస్కృతి చెప్పాలంటే.. మాటలు, మూటలు, ముఠాలు, మంటలు. ఇది కాంగ్రెస్ పార్టీ సంస్కృతి అని మంత్రి తెలిపారు.
అరచేతిలో వైకుంఠం చూపించి, కర్ణాటక నుంచి డబ్బులు సంచులు తెచ్చి గెలవాలని కాంగ్రెస్ పగటి కలలు కంటోంది అని హరీశ్‌రావు పేర్కొన్నారు. కేసీఆర్ ఉన్నంత కాలం కాంగ్రెస్ ఆటలు సాగవు. కేసీఆర్ హయాంలో కరువు లేదు.. కర్ఫ్యూ లేదు. కరువు, కర్ఫ్యూలు లేకుండా ప్రశాంతంగా పరిపాలన సాగుతుంది.
నక్సలైట్లతో చర్చలు జరపుతామని చెప్పి వారిని మట్టుబెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఆరు కిలోల బియ్యం, పగటి పూట కరెంట్ ఇస్తామని, తండాలను గ్రామపంచాయతీలు చేస్తామని చెప్పి మోసం చేశారు.
వాళ్లు చేసిందేమీ లేదు. కేసీఆర్ ఢిల్లీని కదిలించి తెలంగాణను సాధించారు. తెలంగాణ రాకపోతే కల్యాణలక్ష్మి, రైతుబంధు వంటి పథకాలు వచ్చేవా అని హరీశ్‌రావు అడిగారు…