హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆరు గ్యారంటీల అమలులో భాగంగా ఇళ్లు లేని వారికి ఇంటి స్థలం, స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల సాయం అందించాలనే నిర్ణయానికొచ్చింది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలిపి వచ్చే ఆర్థిక సంవత్సరంలో 4,16,500 ఇళ్లు నిర్మించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఆ కార్యాచరణలో భాగంగా ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్‌లో ఇళ్ల నిర్మాణం కోసం రూ.7,740 కోట్లు కేటాయించింది.
గత ప్రభుత్వం కన్నా రూ.రెండు లక్షలు అదనం
మునుపటి భారాస ప్రభుత్వం గృహలక్ష్మి పేరిట ఇంటి నిర్మాణ పథకాన్ని చేపట్టింది. స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం రూ.3 లక్షలు ఇవ్వాలని నిర్ణయించింది. 2023-24 బడ్జెట్‌లో నాలుగు లక్షల ఇళ్ల నిర్మాణానికి వీలుగా నిధులు కేటాయించింది. ఆ పథకం కార్యరూపంలోకి రాలేదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో ప్రకటించిన మేరకు ఒక్కో లబ్ధిదారుడికి రూ.అయిదు లక్షలు ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో అందుకు తగినట్లు నిధులు కేటాయించినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
త్వరలో విధి విధానాలు
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన విధివిధానాలను అధికారులు రూపొందిస్తున్నారు. గతంలో రూపొందించిన మార్గదర్శకాల్లో కొన్నింటిని కూడా పరిశీలిస్తున్నారు. అవి సరిగా లేవని భావిస్తే నూతన విధివిధానాలు రూపొందిస్తామని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. లబ్ధిదారుల ఎంపికపైనా ప్రభుత్వం త్వరలోనే విధాన నిర్ణయాన్ని ప్రకటిస్తుందని తెలిపారు. ‘‘ఆరు గ్యారంటీల అమలుకుసర్కారు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ఇందిరమ్మ ఇళ్ల కోసం సుమారు 82 లక్షల వరకు దరఖాస్తులు అందాయి. వాటి వడపోత ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత అసెంబ్లీ నియోజకవర్గం వారీగా అర్హుల జాబితాను సిద్ధం చేస్తాం. ఏయే సామాజికవర్గాలకు ఎన్నెన్ని ఇళ్లు..ఏ ప్రాతిపదికన కేటాయించాలో ప్రభుత్వం ప్రకటించిన మీదట అమలు దిశగా ముందుకెళ్తాం’’ అని ఆ అధికారి వెల్లడించారు.