1 lakh 30 thousand fishermen are newly registered
సాక్షిత : ఒక లక్ష 30 వేల మంది మత్స్యకారులకు నూతనంగా సభ్యత్వం కల్పించడమే లక్ష్యంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయం నుండి అన్ని జిల్లాల మత్స్యశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఆధర్ సిన్హా, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా, ఇతర మత్స్య శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మత్స్య సొసైటీలలో సభ్యత్వం డ్రైవ్ -2 కు సంబంధించిన పోస్టర్ ను మంత్రి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నీటి వనరులు ఉన్నా ఇంతవరకు మత్స్య సొసైటీలు లేనటువంటి గ్రామాలను గుర్తించి ఆయా గ్రామాలలో అర్హులైన వారితో నూతన సొసైటీలను ఏర్పాటు చేయడమే ఈ స్పెషల్ డ్రైవ్ ఉద్దేశంగా మంత్రి వివరించారు. మూడు నెలలపాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నిబంధనల ప్రకారం అర్హులైన మత్స్యకారులకు సభ్యత్వం కల్పించడం జరుగుతుందని చెప్పారు. ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ఈ డ్రైవ్ ను చేపట్టినట్లు వివరించారు.
తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో 3,200 మత్స్య సహకార సంఘాలు 2.20 లక్షల మంది సభ్యులతో ఉండేవి. ప్రస్తుతం 5,200 మత్స్య సహకార సంఘాలు 3.57 లక్షల మందితో నడుస్తున్నవి.
చేపల ఉత్పత్తి 2016-17 నాటికి 1.99 లక్షల టన్నులు సుమారు 2252 కోట్ల రూపాయలుగా ఉండెను. 2021-22 సంవత్సరంలో 3.89 లక్షల టన్నులు 5,859 కోట్ల రూపాయలు విలువ గల చేపల ఉత్పత్తి జరిగింది. రాష్ట్ర GSDP లో మత్స్య సంపద వాటా 0.3 శాతం నుండి 0.5 శాతం కు పెరిగింది.
కాళేశ్వరం మరియు వివిధ నీటి పారుదల ప్రాజెక్టుల వలన అన్ని చెరువులు, కుంటలకు సమృద్దిగా నీటి సరఫరా జరుగుతుంది. చెరువుల సంఖ్య మరియు నీటి విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. తర్వాత సంవత్సరం పొడవున నీరు ఉండటం వలన చేపల ఉత్పత్తి పెరగడం, ఎక్కువ మందికి సభ్యత్వం కల్పించే అవకాశాలు ఏర్పడినాయి. మత్స్యకారుల సంక్షేమం దృష్టిలో ఉంచుకొని పంచాయితీరాజ్ శాఖ పరిధిలోని కుంటలను మత్స్య శాఖ కు బదిలీ చేసి సహకార సంఘాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నామమాత్రపు ధరతో లీజుకు ఇవ్వడం జరుగుతుంది.
అన్ని నీటి వనరులను జియో ట్యాగింగ్ చేయడం జరిగింది. మత్స్యకారుల సంక్షేమం, ఉచిత చేప పిల్లలు, రొయ్య పిల్లల సరఫరా, సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మానసపుత్రిక. పైన చెప్పబడిన అభివృద్ధి మొత్తం ముఖ్యమంత్రి విజన్ తో ఉచితంగా చేప, రొయ్య పిల్లలను పంపిణీ చేస్తున్న దేశంలోనే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్బవించిన తర్వాత రాష్ట్రంలోని చెరువులు, కుంటలు, రిజర్వాయర్ లు నీటితో కళకళలాడుతున్నాయని చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన చర్యలతోనే రాష్ట్రంలో మత్స్య సంపద గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు. దానివలన గతంలో మత్స్య సంపద ద్వారా జీవనోపాధి సరిగా లేనందున మత్స్యకారులు గ్రామాల నుండి ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్ళారు.
ప్రస్తుతం మత్స్య సంపద పెరిగి గ్రామాలలో ఆదాయ వనరులు సృష్టించబడినందున తిరిగి సొంత గ్రామాలకు చేరుకొని మత్స్య సొసైటీలలో సభ్యత్వం కోసం ఆసక్తి చూపుతున్నారని మంత్రి వివరించారు. వారి ఆదాయ వనరుల కొరకు సంపదను సృష్టించాలి…పేదలకు పంచాలి…అనే నినాదంతో పెరిగిన మత్స్య సంపద ఫలాలను మత్స్యకారులకు అందించాలనేది ప్రభుత్వ, ముఖ్యమంత్రి ఆలోచన అని చెప్పారు.
గతంలో ఈ వృత్తితో సంబంధం లేని కులాల వారికి కూడా మత్స్య సొసైటీ లలో సభ్యత్వాలు కల్పించారని, ఈ వృత్తితో సంబంధం ఉన్న వారికి మాత్రమే సభ్యత్వం కల్పిస్తున్నట్లు తెలిపారు. స్పెషల్ డ్రైవ్ పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను కూడా నియమించడం జరిగిందని చెప్పారు.
ఎలాంటి విమర్శలకు అవకాశం లేకుండా 18 సంవత్సరాలు నిండి నిబంధనల ప్రకారం అర్హులైన మత్స్యకారులను మాత్రమే సభ్యులుగా చేర్చుకోవాలని స్పష్టం చేశారు. స్కిల్ టెస్ట్ (వృత్తి నైపుణ్య పరీక్ష) లో అవసరమైన శిక్షణ ను కూడా మత్స్య శాఖ ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుందని మంత్రి శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మొదటి విడత లో చేపట్టిన స్పెషల్ డ్రైవ్ లో 7,963 మంది సభ్యులతో 406 మత్స్య సొసైటీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
మరో 241 సొసైటీల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతుందని, ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. మత్స్యశాఖ ముఖ్యమంత్రి మానసపుత్రిక అని, గతంలో ఎన్నడూ లేని విధంగా మత్స్య శాఖ కు పెద్ద ఎత్తున నిధులు కేటాయించారని చెప్పారు.
అసెంబ్లీ లో కూడా అనేక సార్లు రాష్ట్రంలోని అన్ని నీటి వనరులలో చేపపిల్లలు విడుదల చేయాలని చెప్పారని తెలిపారు. మత్స్యకారులు తక్కువ ధరకు చేపలను విక్రయించుకొంటూ ఎంతో నష్టపోతున్నారని, అలా నష్టపోకుండా సరైన ధరకు అమ్ముకొనే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. మత్స్యకారులు చేపలను విక్రయించుకోనేందుకు వెయ్యి కోట్ల వ్యయంతో సబ్సిడీ పై వివిధ రకాల వాహనాలను అందజేసిన విషయాన్ని గుర్తు చేశారు
. సభ్యత్వ నమోదు స్పెషల్ డ్రైవ్ పూర్తయిన తర్వాత మార్కెటింగ్ సొసైటీల ఏర్పాటు కు చర్యలు చేపడతామని వివరించారు. పెబ్బేరు మత్స్య కళాశాల నుండి మత్స్య శాస్త్రంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుంటున్న విద్యార్ధులకు మత్స్య పరిశ్రమపై అవగాహన కల్పించి వారికి ఉద్యోగ భద్రత కల్పించేందుకు తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.