అసెంబ్లీలో తన వాణి వినిపించిన మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్
ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో మైలవరం నియోజకవర్గంలో 25వేల మందికి ఇళ్ళపట్టాలు అందజేశాం. కొన్ని గ్రామాల్లో ఇళ్లపట్టాల పంపిణీలో కొన్ని గ్రామాల్లో సాంకేతిక సమస్యలు ఉత్పన్నమయ్యాయి.
మైలవరం మండలంలోని చండ్రగూడెం గ్రామంలో దాదాపు 550 మందికి ఇళ్లపట్టాలు ఇచ్చాము. కానీ ఆ భూమి తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో ఉంది. ఇళ్ల నిర్మాణానికి ఆ భూమి అనుకూలంగా లేని కారణంగా అక్కడ స్థలాలను రద్దు చేశాం. మళ్ళీ ఆ గ్రామంలో భూమి సేకరించి ఇళ్లస్థలాలు ఇవ్వాలి.
అలాగే జి.కొండూరు మండలం వెంకటాపురం, చెవుటూరు గ్రామాల్లో కోర్టులో వివాదాల వల్ల ఇళ్లస్థలాలు ఇవ్వలేకపోయాం. ఇలా నియోజకవర్గంలో 6 గ్రామాల్లో ఇళ్లస్థలాలు ఇవ్వలేకపోయాం. దీనిపై తగు చర్యలు చేపట్టి ప్రజల ఇబ్బందులు తొలగించాలి.
మైలవరం నియోజకవర్గం విజయవాడ నగరానికి పక్కనే ఉన్న నియోజకవర్గం. ఇక్కడ విజయవాడ నగర ప్రాంత వాసులకు ఇళ్లస్థలాలు ఇచ్చాం. అలాగే గొల్లపూడి, ఇబ్రహీంపట్నం, కొండపల్లిలో ఇళ్లస్థలాలు ఇచ్చాము. ఆయా ప్రాంతాల్లో ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో రహదారులు నిర్మించాము. కొంతమంది ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించారు. కాలక్రమంలో అక్కడ రహదారులు ఛిద్రం అయ్యాయి. మిగతా వాళ్ళు ఇళ్లు కట్టుకోవాలంటే చాలా అవస్థగా ఉంది. దీనిపై కూడా ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాల్సి ఉంది.