చేర్యాల: సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి క్షేత్రంలో మల్లన్న కళ్యాణ మహోత్సవం ఆదివారం అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నారు. రెండు రోజులపాటు వైభవంగా ఈ వేడుకలు జరగనున్నాయి.
ఈ నెల 7వ తేదీ వేకువజామున 5గంటలకు స్వామి వారికి దృష్టికుంభం(బలిహరణం),10.45 గంటలకు స్వామి వారి కల్యాణం, మధ్యాహ్నం 12గంటలకు ఏకాదశ రుద్రాభిషేకం, రాత్రి 7గంటలకు రథోత్సవం(బండ్లు తిరుగుట), 8వ తేదీ సోమవారం ఉదయం 9గంటలకు స్వామి వారికి ఏకాదశ రుద్రాభిషేకం, లక్షబిల్వార్చన, అనంతరం మహా మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వితరణ, మహా మంగళహారతి, మంత్రపుష్పం, తీర్ధ ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఆలయ సంప్రదాయం మేరకు వరుడు మల్లికార్జున స్వామి వారి తరపున పడిగన్నగారి వంశస్తులు, వధువులు మేడలాదేవి, కేతమ్మ దేవీ తరపున మహాదేవుని వంశస్తులు పాల్గొని కల్యాణాన్ని జరిపిస్తారు. స్వస్తిశ్రీ శోభకృత్ నామ సంవత్సరం మార్గశిర మాసం ఏకాదశి ఆదివారం 10.45 గంటలకు ఈ వేడుక జరగనుంది. కొమురవెల్లి పుణ్యక్షేత్రంలోని ఇంద్రకీలాద్రి ఆలయ ప్రాంగణంలోని తోట బావి వద్ద నిర్మించిన కల్యాణ వేదిక వేద ఉజ్జయిని పీఠాధిపతి జగద్గురు సిద్ద లింగరాజ దేశికేంద్ర శివాచార్య మహాస్వామీజీ ఆధ్వర్యంలో కల్యాణం నిర్వహిస్తారు. కొమురవెల్లి క్షేత్రంలో జరిగే ఈ కల్యాణోత్సవానికి రాష్ట్ర నలుమూలలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలిరానున్నారు. ఈ క్రమంలో భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, మల్లన్న కల్యాణానికి రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ హాజరై పట్టు వస్ర్తాలు సమర్పిస్తారు. మంత్రి కొండా సురేఖతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు, రాష్ట్ర ఉన్నతాధికారులు హాజరుకానున్నట్లు ఆలయవర్గాలు వెల్లడించాయి.