అన్నం పెట్టేవారిని గుండెల్లో ప్రతిష్టించుకోవాలి!!
——- మంత్రి జోగి రమేష్
అన్నం పెట్టేవారిని గుండెల్లో ప్రతిష్టించుకోవాలని, మనం అడగకపోయినా మనకు అవసరమైన ఉపకారం చేసేవారు అతి తక్కువమంది ఈ లోకంలో ఉంటారని వారిపట్ల కృతజ్ఞత కల్గి ఉండటమనేది మానవ సంస్కారమని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ వక్కాణించారు.
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గంలో ఎంతో ఉత్సాహంగా సాగుతోంది. గురువారం ఉదయం 9 గంటల సమయంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పెడన మండలం పుల్లపాడు పంచాయతీ పరిధిలో విస్తృతంగా పర్యటించారు. రామాలయం, చెరువుకట్ట ప్రాంతాల్లో ఆయన 300 ఇళ్లను సందర్శించారు.
పడమటి ఆదిలక్ష్మి, పామర్తి రేణుకాదేవి, చిల్లిముంత వీర రాఘవమ్మ, గూడవల్లి తాళ్ళమ్మ, వెలివోలు వంశి, మురారి వెంకటరావమ్మ తదితరుల గృహసందర్శన 11 గంటల సమయంలో వర్షం కురుస్తున్నా మంత్రి జోగి రమేష్ ఆ చిరుజల్లుల వర్షంలోనూ గొడుగుల చేతపట్టి తన కార్యక్రమానికి కొనసాగించారు. దీంతో ఆయన పట్టుదలకు వరుణుడు సైతం ముచ్చటపడి వర్షాన్ని వాయిదా వేశారని స్థానిక నాయకులు వాఖ్యానించడం గమనార్హం.
పుల్లపాడు గ్రామంలో ఇంటింటికి వెళ్ళి ప్రభుత్వం చేస్తున్న పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ, ఒకరు తమకు చేసిన ఉపకారాన్ని గ్రహించటం పుణ్యమని, దానికి సమానమైన ప్రత్యుపకారాన్ని చేయటం మధ్యమం అని , ఉపకారానికి మించిన ప్రత్యుపకారం చేయటం ఉత్తమం అని అన్నారు. ఏరు దాటాక తెప్ప తగలేసే చందంగా కాకుండా, మన ఉనికికి, ఉన్నతికి కారకులైనవారి పట్ల మనం కృతజ్ఞులమై ఉండాలని అన్నారు. ఒకనాడు మనకు మేలుచేసిన మనిషి, విధివశాత్తూ కష్టంలో పడినట్టు మనకు తెలిస్తే, వారి పట్ల సకాలంలో, అవసరానికి తగినట్టుగా స్పందించకపోతే అది కృతజ్ఞత ఎలా ఔతుందని ప్రశ్నించారు.
దళారీ వ్యవస్థ లేకుండా అవినీతి రహిత పాలన అందించడమే ప్రధాన లక్ష్యమన్నారు. మీ అందరికీ తోడు నీడగా నిలుస్తున్న మన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అభిమతమన్నారు. మన కోసం రేయంబగళ్ళు పాటు పడుతున్న ముఖ్యమంత్రికి మీరంతా బాసటగా నిలవాలిని,మీ అందరి దీవెనలు,ఆశీర్వాదాలు ఆయనకు అందచేయాలని మంత్రి జోగి రమేష్ కోరారు. తర్వాత ఆయన పుల్లపాడు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు.
చిన్నారులతో కాసేపు ముచ్చటించి వారి ముద్దు మాటలకు ఎంతో సంతోషించారు. చిన్నారులకు మంచి బలవర్ధకమైన ఆహరం అందించడమే కాక వారిని క్రమశిక్షణ మంచి విద్యాబుద్ధులు చిన్ననాటి నుండే అందివ్వ;లని అంగన్వాడీ ఉపాధ్యాయిని పి. నాగమణికి సూచించారు. మెరక చేయించి, అంగన్వాడీ పాఠశాల చుట్టూ ప్రహారీగోడ తప్పక నిర్మింపచేయిస్తానని స్థానికులకు మంత్రి జోగి రమేష్ హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పుల్లపాడు సర్పంచ్ జోగి నాగేశ్వరమ్మ, పెడన ఎంపిపి రాజులపాటి వాణి, కృత్తివెన్ను జెడ్పిటీసి మైలా రత్నకుమారి, స్థానిక వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జోగి సుబ్రహ్మణ్యం, గరికిపాటి వెంకట రామానాయుడు, పెడన మండల పార్టీ కన్వినర్ కొండవీటి నాగబాబు, మాజీ ఎంపిపి రాజులపాటి అచ్యుతరావు, పెడన 3 వ వార్డు కౌన్సిలర్ బళ్ళా గంగయ్య, పెడన తహసీల్దార్ పి.మధుసూదన రావు, విద్యుత్ శాఖ ఏ డి ఈ సి హెచ్ కె ఆర్ మాణిక్యాల రావు పెడన మునిసిపాలిటీ ఫ్లోర్ లీడర్ కటకం ప్రసాద్, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు దాన భైరవ లింగం, మతిన్ ఖాన్, స్థానిక ప్రజా ప్రతినిధులు , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు,వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.